Saturday, 4 May 2019

తొలి విడతకు వేళాయె

  • ప్రాదేశిక ఎన్నికల్లో తొలి విడత సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల ప్రచారానికి నేటి (శనివారం)తో తెరపడనుంది. 
  • కామారెడ్డిలో జడ్పీటీసీ 9, 82 ఎంపీటీసీలు, నిజామాబాద్‌లో 7 జడ్పీటీసీలు 94 ఎంపీటీసీ స్థానాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. 
  •  అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అధినేత ఆదేశాలకు తోడు..నియోజకవర్గంలో తమ రాజకీయ బలాన్ని చాటి చెప్పేవి కావడంతో అభ్యర్థుల ఎంపికలతో పాటు వారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం కొన్నిచోట్ల నువ్వా-నేనా అనేట్లు పోటీని ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 
  •  తొలి విడత ఎన్నికలు జరిగే వాటిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలు ఉన్నాయి. నిజామాబాద్‌ గ్రామీణం నియోజకవర్గం మొత్తం, బోధన్‌, ఆర్మూర్‌లో ఒక్కో మండలం ఉంది. ఆయా చోట్ల మండల పరిషత్తులు కైవసం చేసుకునేలా ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొనేందుకు తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కాగా కామారెడ్డి జిల్లా పరిధిలో పలుచోట్ల కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న వారు గట్టి పోటీనిస్తున్నారు. భాజపా కొన్ని చోట్ల బలంగా కనిపిస్తోంది. ఇలా ఇరు పార్టీల నుంచి గెలిచిన వారు స్థానిక పొత్తుల ద్వారా మండల పరిషత్‌ను గెలుచుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోనూ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. 

తెరాస నుంచి రెబల్స్‌.. 

అభ్యర్థుల ఎంపిక అనంతరం తెరాసలో తలెత్తిన అసమ్మతి పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. కొందరు రెబల్‌గా బరిలోకి దిగారు. వీరిలో ఒకరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన పరిస్థితి కూడా ఉంది. వీరు ఆయా చోట్ల ఓట్లు చీలిస్తే ఎవరికి నష్టమనే చర్చ కూడా సాగుతోంది. పార్టీలో క్యాడర్‌ను సంతృప్తి పర్చటం ఎమ్మెల్యేలకు కత్తి మీద సాముగా మారిందనే చెప్పాలి. ఎల్లారెడ్డిలో పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సురేందర్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అనుచరులు, బీఫారం దక్కని వారు కొంత అసంతృప్తికి లోనయ్యారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. సీనియర్లుగా ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇచ్చారని కొన్నిచోట్ల అలకపూనిన పరిస్థితులు ఉన్నాయి.

ఎండను లెక్క చేయక.. 

ఇందూరు జిల్లా ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీల నడుమ నమోదవుతున్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. శనివారం సాయంత్రంతో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో హోరాహోరీగా అన్ని పార్టీల వారు ప్రచారాన్ని కొనసాగిన్నారు. సాయంత్రం వేళల్లో కూడళ్లు, కమ్యూనిటీ హాళ్ల వద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుల సంఘాల పెద్దలను కలిసి మద్దతు కోరుతున్నారు. పార్టీ గుర్తుల ఆధారంగా పోరు జరగనుండటంతో గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నెలకొన్న సందడికి మించి హడావుడి కనిపిస్తోంది. తొలి విడతలో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

No comments:

Post a Comment