Tuesday, 7 May 2019

ఆస్తమా గ్రస్తులకు అరుదైన చికిత్స

- పల్మనాలజిస్ట్ నిమ్స్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్

నిజామాబాద్‌‌ వార్త: నగరంలోని ఖలీల్‌‌వాడి జిల్లా గ్రంధాలయం ఎదుట గల శ్రీ విష్ణు మల్టీస్పెషల్టి హాస్పిటల్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అరుదైన చికిత్సను అందిస్తున్నామని  పల్మనాలజిస్ట్, నిమ్స్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం అంతర్జాతీయ ఆస్తమా నివారణ దినోత్సవ సందర్భంగా శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక శ్వాసకు సంబంధించిన వ్యాధి అన్నారు. ఆస్తమా వ్యాధి ఉన్నవారికి ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుందని, గాలి పీల్చుకోవడం కూడా అత్యంత కష్టతరంగా మారుతుందన్నారు. చాలామంది మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది గుండె ఒకటే అని అనుకుంటారు కానీ ఊపిరితిత్తుల సామర్థ్యం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని మరచి పోతుంటారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  ఆస్తమా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, మన ఆహారపు అలవాట్లు, ధూమపానం, వాతావరణ కాలుష్యం, దుమ్ము ధూళి ఊపిరితిత్తులను బలహీనం చేస్తున్నాయన్నారు. ఆస్తమా అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచి అలవాట్లను పెంపొందించుకోవడం చాలా అవసరం అన్నారు. తరచూ జలుబు రావడం, దగ్గు దుమ్ము, ఛాతి బిగుసుకు పోవడం, పిల్లికూతలు, గాలి తీసుకోవడం కష్టంగా ఉండటం, ముఖ్యంగా చల్లని వాతావరణంలో ఈ లక్షణాలు ఎక్కువగా అవ్వడం ఆస్తమా లక్షణాలని వివరించారు.  పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష ద్వారా అలర్జీ పరీక్షల ద్వారా ఆస్తమా జబ్బులు నిర్ధారణ చేసి, వ్యాధి తీవ్రతను గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఆస్తమాకు పలు రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, జబ్బు తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని తెలిపారు. వ్యాధి నియంత్రణకు అత్యుత్తమ మార్గం ఇన్హేలర్ అని,  దీనివలన మెడిసిన్ నేరుగా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. జబ్బు తీవ్రతను బట్టి ఏ రకం ఇన్హెలర్లు ఇవ్వాలి, ఎంత డోస్ తో ఇవ్వాలి అనేది  వైద్యులు నిర్ణయిస్తారని తెలిపారు. మెడిటేషన్ ద్వారా ఆస్తమాను నియంత్రించుకోగలిగితే సంతోషంగా జీవనం గడపడం చాలా సులభం అన్నారు. బీపీ, షుగర్ జబ్బు ఉన్నవారు ఏ విధంగా అయితే క్రమం తప్పకుండా చెక్ చేయించుకొంటారో... అలాగే అస్తమా ఉన్నవారు కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం చెక్‌‌ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఆరోగ్యంగా ఉండగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగార్జున్, రమనేశ్వర్, భైరవ్నాథ్, రాజశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమాశంలో మాట్లాడుతున్న డాక్టర్‌‌ బొద్దుల రాజేంద్రప్రసాద్‌‌

No comments:

Post a Comment