Sunday, 5 May 2019

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్‌ వార్త:  నిజాంసాగర్‌ మండలంలోని తున్కిపల్లి గ్రామానికి చెందిన కాయి లక్ష్మి(28) అత్తింటి వేధింపులు భరించలేక  గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గాంధారి మండలం సర్వాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మికి 12ఏళ్ల కిందట తున్కిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశంతో వివాహం జరిగింది. వీరికి మనోజ్‌కుమార్‌(11), మనుశ్రీ(7)  ఉన్నారు. గత కొంత కాలంగా భర్త వెంకటేష్‌తో పాటు అత్త, మరిది అదనపు కట్నం కోసం ప్రతి నిత్యం వేధించేవాడని తెలిపారు. శనివారం కూడా లక్ష్మిపై భర్త దాడి చేసి గాయపర్చాడన్నారు. దీంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నిప్పంటించుకొని వ్యక్తి...

నిజామాబాద్‌ వార్త (రుద్రూర్‌) : మండల కేంద్రానికి చెందిన దాసరి సాంబమూర్తి(58) ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో మృతి చెందినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈ సంఘటనకు పాల్పడినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందినట్లు వివరించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

No comments:

Post a Comment