Sunday, 5 May 2019

డబ్బుల కోసమే హత్య చేశారు

కంఠేశ్వర్‌ జంట హత్య కేసు ఛేదింపు

నిజామాబాద్‌ వార్త: నిజామాబాద్‌ కంఠేశ్వర్‌ జంట హత్యోదంతం కేసును పోలీసులు ఛేదించారు. కేవలం డబ్బుల కోసమే శ్రీకాంత్‌, సాయి అనే ఇద్దరిని అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులైన మహ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌, అభిలాష్‌ను మూడో ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తదనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర సీఐ నరేశ్‌ కేసు వివరాలను వెల్లడించారు. హత్యకు గురైన టీ కొట్టు యజమాని శ్రీకాంత్‌ శెట్టి గతంలో బోధన్‌లో టీ కొట్టును నడిపాడు. ఇదే టీ కొట్టులో చందూర్‌ మండలానికి చెందిన ఏ1 నిందితుడైన అబ్దుల్‌ గఫార్‌ అలియాస్‌ నాసర్‌ పనిచేశాడు. ఆ సమయంలో శ్రీకాంత్‌ వద్ద డబ్బులు ఎక్కువగా ఉంటుండటాన్ని గమనించాడు. కొన్నాళ్ల తర్వాత అతని వద్ద పని మానేసి గఫార్‌ తిరిగి దుబాయ్‌ వెళ్లిపోయాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌ సైతం టీ కొట్టు అడ్డాను నిజామాబాద్‌ కంఠేశ్వర్‌కు మార్చాడు. ఈ ఏడాది మార్చిలో దుబాయ్‌ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చిన అబ్దుల్‌ గఫార్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో గతంలో తాను పనిచేసిన టీ కొట్టు యజమాని శ్రీకాంత్‌ వద్ద డబ్బులు ఎక్కువగా ఉంటాయని భావించుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్‌ కంఠేశ్వర్‌లో టీ కొట్టు నడుపుతున్నాడని తెలుసుకొని ఈ నెల 1వ తేదీన రాత్రి 11.45 గంటల ప్రాంతంలో తన గ్రామానికి చెందిన స్నేహితుడు అభిలాష్‌తో కలిసి అతని ఇంటికి వెళ్లాడు. అయితే అప్పటికే శ్రీకాంత్‌, సాయి ఇంట్లో ఉండటంతో దుబాయ్‌ నుంచి వచ్చానని కలిసేందుకు వచ్చినట్లు శ్రీకాంత్‌ను నమ్మించాడు. అనంతరం అందరు కూడా కలిసి భోజనం చేసి నిద్రపోయారు. అదే సమయంలో అబ్దుల్‌ గఫార్‌ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో శ్రీకాంత్‌ గుండెపై పొడిచాడు. ఆ సమయంలో శ్రీకాంత్‌ అరుపులు చేయకుండా అభిలాష్‌ తలపై దిండుతో గట్టిగా ఒత్తిపెట్టాడు. కాసేపటికే సాయి నిద్రలోంచి తేరుకోగా అతన్ని కూడా ఇదే తరహాలో హతమర్చారు. డబ్బుల కోసం ఇళ్లంతా వెతికారు. చివరకు రూ.2 వేలు, ఇద్దరి సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లారు. తదనంతరం రెండ్రోజుల తర్వాత దుర్వాసన రావటంతో ఇంటి యజమాని నాగభూషణం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

హత్యకు గురైన శ్రీకాంత్‌‌, సాయి (పాతచిత్రం)


చరవాణిలే పట్టించాయి

హత్యోదంతం అనంతరం ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా నిందితులు జాగ్రత్తపడినా చివరకు వారు ఎత్తుకెళ్లిన చరవాణులు పట్టించాయి. శ్రీకాంత్‌, సాయిలకు చెందిన రెండు చరవాణులను వీరు అపహరించుకెళ్లారు. ఈ నెల 2వ తేదీన ఓ చరవాణిలో నిందితుడు తన సిమ్‌ను వేసుకొన్నాడు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిన అనంతరం కూడా దీనిని ఉపయోగించాడు. వీటి ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించగలిగారు. కాగా.. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన నగర సీఐ నరేశ్‌, ఎస్సై సంతోష్‌కుమార్‌ బృందాన్ని సీపీ కార్తికేయ, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ అభినందించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు నగదు, చరవాణిలను స్వాధీనం చేసుకొని రిమాండుకి తరలించినట్లు సీఐ నరేశ్‌ వెల్లడించారు.


No comments:

Post a Comment