Tuesday, 2 April 2019

ఆటిజంతో బాధపడుతున్న వారిని వికలాంగులుగా చూడొద్దు

సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జి కిరణ్మయి
 ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను మానసిక వికలాంగులుగా భావించకుండా వారిని సరైన చికిత్స అందించి, శిక్షణ ఇచ్చినట్లయితే వారు కూడా అభివృద్ధి చెందుతారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జి కిరణ్మయి అన్నారు. ఆమె మంగళవారం జిల్లా కేంద్రం మారుతీనగర్‌‌లోని స్నేహసొసైటీ ఫర్‌‌ రూరల్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌, శాంతిగిరి ఆయుర్వేద మరియు సిద్ద హాస్పిటల్‌‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రపంచ ఆటిజమ్‌‌ అవగాహన దినోత్సవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తల్లిదండ్రులు వారిని భారంగా భావించకుండా సరైన సమయంలో సరైన సంస్థలో చేర్పించాలని సూచించారు. మనదేశంలో ఆటిజమ్‌‌ పిల్లలను మానసిక వికలాంగులుగా చూస్తున్నారన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ద్వారా వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆటిజమ్‌‌ పిల్లలకు ఉచిత వైద్యం, విద్య అందించడానికి ప్రభుత్వం తరఫున పథకాలున్నాయన్నారు. ఆటిజమ్‌‌ పిల్లల పట్ల సమాజం, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపితే వారు మనదేవానికి భవిష్యత్తు అవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మానసిక వైద్యుడు డాక్టర్‌‌ విశాల్‌‌ మాట్లాడుతూ అతిచిన్న వయస్సులో ఆటిజమ్ సమస్యను పిల్లల్లో గుర్తించి చికిత్సను అందించినట్లయితే వ్యాదిని నివారించవచ్చన్నారు. గర్భవతులు తప్పనిసరిగా ఫోలిక్‌‌ యాసిడ్‌‌ మాత్రలు వాడినట్లయితే ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారన్నారు. విటమిన్‌‌ డి లోపంతో ఆటిజమ్‌‌ పిల్లలు పుడతారని వివరించారు. కార్యక్రమంలో భాగంగా శాంతిగిరి ఆయుర్వేద మరియు సిద్ద హాస్పిటల్‌‌ వారు ఆయుర్వేద వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న 80 మంది మానసిక వికాలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మానసిక వికలాంగులు, అంధ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా ప్రదర్శన ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్‌‌ జ్యోతి, కార్యదర్శి ఎస్‌‌.సిద్దయ్య, వైస్‌‌ ప్రిన్సిపల్‌‌ రాజేశ్వరి, మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బంది, డిఎల్‌‌ఎస్‌‌ఏ సూపరింటెండెంట్‌‌ పురుషోత్తం గౌడ్‌‌, అంధుల పాఠశాల సిబ్బంది, శాంతిగిరి ఆయుర్వేద సిద్ద హాస్పిటల్‌‌ వైద్యులు డాక్టర్‌‌ ధనలక్ష్మి, మేనేజర్‌‌ గిరిజా కుమారి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జి కిరణ్మయి


మానసిక వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు

మానసిక వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌‌ ధనలక్ష్మి

No comments:

Post a Comment