Tuesday, 2 April 2019

చిన్న పిల్లలలో ఆటిజంను త్వరగా గుర్తించాలి

అవగాహన సదస్సులో డాక్టర్ బి. కేశవులు

  చిన్న పిల్లలలో వచ్చే ఎదుగుదల జబ్బు (ఆటిజం)ను  తొలి దశలోనే గుర్తించి, త్వరగా చికిత్స అందించినట్లయితే ఈ జబ్బును అధిగమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని  మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి. కేశవులు సూచించారు.  ప్రపంచ ఆటిజం దినోత్సవం  సందర్భంగా మంగళవారం ఆయన మనో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో  ఖలీల్వాడి  కార్యాలయంలో   జరిగిన  అవగాహన సదస్సుకు   ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు,
గతంలో చిన్న పిల్లలలో వచ్చే ఆటిజమ్ జబ్బు ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుందన్నారు. మన దేశంలో కూడా అన్ని వర్గాలలో ఎక్కువగా కనిపిస్తుందని,  3‒6 ఏళ్ల పిల్లలలో 125 మందిలో ఒకరికి,  9 ఏళ్ల వరకు ప్రతి వంద మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు.  పట్టణ  ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో కంటే ఎక్కువగా ఆటిజం బాధితులున్నారని వివరించారు. బాలికల కంటే  బాలుర లోనే అధికంగా ఈ జబ్బు వస్తుందన్నారు.   పుట్టినప్పటినుంచి శిశు ప్రతి కదలికా, దశ, సాఫీగా జరిగిపోతున్న తరుణంలో, కొందరు ఇతరులతో కలవలేకపోవడం, తోటి పిల్లలతో ఆడు కోలేకకోవడం, ఒంటరిగా గడపటం, తమ భావాలను వ్యక్త పరచ లేకపోవడం, ఏదైనా కావాలంటే నోటితో పెద్దవాళ్ల చేయి పట్టుకొని తీసుకెళ్లి అడగటం,   చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఎలాంటి కారణం లేకుండా ఏడవటము,  సంతోషము, బాధ  వంటి భావాలు ముఖంలో కనిపించకపోవడం, దెబ్బ తగిలినా పట్టించుకోక పోవడం ఆటిజం వ్యాది లక్షణాలని పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు  పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌‌ కేశవులు

No comments:

Post a Comment