Tuesday, 2 April 2019

కమలం పువ్వుకు ఓటేస్తే.. పెన్షన్లు ఆగయి.. ఇండ్లస్తయి..

‒ బీజేపీ నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌‌
ఇండ్లు కట్టేందుకు నిధులు కావాలంటే బీజేపీని గెలిపించాలని... మరోసారి చెప్తున్నా.. కమలం పువ్వుకు ఓటేస్తే.. పెన్షన్లు ఆగయ్‌‌.. ఇండ్లు అస్తయ్‌‌.. అని బీజేపీ నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌‌ స్పష్టం చేశారు. మంగళవారం పాలిటెక్నిక్‌‌ మైదానంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌ ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ విజయ సంకల్పయాత్రలో ఆయన మాట్లాడారు. అక్క చెల్లెండ్లు ఎక్కువ మంది వచ్చిండ్రు ఇవ్వాల.. ఎమవ్వా మనకు ఇండ్లు కావాల్నా... వద్దా..? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి ఇండ్లు కట్టిస్తామన్నారని, కానీ మనకు వచ్చిన నిధులను మన కవితమ్మ మిషన్‌‌ భగీరథకు మళ్లిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఇతర రాష్ట్రాలన్నింట్ల ఇండ్లు కట్టిస్త ఉంటే మన్నదగ్గర మాత్రం ఇస్తలేరన్నారు. కాబట్టి మీకు ఇండ్లు కావాలంటే ఈసారి కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు. టీఆర్‌‌ఎస్‌‌ ఓడిపోతే పెన్షన్‌‌లు ఆగిపోతయంట కదా.. అని నాతో చాలా మంది మహిళలు అడిగారన్నారు. వాస్తవానికి టీఆర్‌‌ఎస్‌‌ ఇచ్చేది చారాన మందమేనని, బారాన మందం బీజేపీ ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు. కాబట్టి ఏ పరేషాన్‌‌ గాకుండ్రి.. బేఫికర్‌‌గ ఉండుండ్రి అని భరోసా ఇచ్చారు. వెస్ట్‌‌ బెంగాల్‌‌ లో ఉంటున్న కవితమ్మ పెద్దత్తమ్మ మమతా బెనర్జీ దుర్గాదేవి పూజలు బ్యాన్‌‌ చేయించిందన్నారు. కాశ్మీర్‌‌లో కవితమ్మ తాత ఉంటడు ఫరూక్‌‌ అబ్దుల్లా.. ఈమె లెక్క ఆయన కూడా కాశ్మీర్‌‌ ఇండియాలో భాగం కాదంటడు అన్నారు. ఇక వాళ్ళ అక్క ఉంటది మెహబూబ ముఫ్తి గామెది కుడ గదే కథ.. ఈశాన్య రాష్ట్రాలలోకి రోహింగ్యాలకు వస్తున్నారు.. బంగ్లాదేశ్‌‌లోకి ఇల్లీగల్‌‌ మేగ్రెంట్లు వస్తున్నారు.. రామ మందిరం మీద నీ మాటేంది? ఇవ్వన్నింటి జోలి దియ్యకుండా గివ్వన్నింటి గురించి చెప్పకుండ ఓట్లడుగుతానంటే గిది 10 జిల్లాల ఎలక్షన్‌‌ గాదవ్వో..? ఇది జాతీయ స్థాయి ఎలెక్షన్‌‌ అంటూ కవితను సూటిగా ప్రశ్నించారు.
దేశ భద్రత, అభివృద్ధి కోసం మోదీని మళ్ళీ ప్రధానిని చేయాలి


బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారరెడ్డి

దేశ భద్రత కోసం, ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత దేశం అభివృద్ధి కోసం మోదీని మళ్ళీ ప్రధానిని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. భావితరాల బంగారు భవిత కోసం కేంద్రం లో మళ్ళీ బీజేపీని గెలిపించాలన్నారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాక్ ముష్కరులను అంతమొందించిన ఘనత మోదీది అన్నారు. దేశంలోని రైతాంగానికి 2022 వరకు వారు పండించిన పంటకు ఒకటిన్నర శాతం మద్దతు ధర అందజేసి రైతులు ఆనందంగా ఉండేందుకు నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పనిచేసిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీ అని ఆయన వివరించారు. టెర్రరిస్టులు మనదేశంపై దాడి చేస్తే .. గత ప్రభుత్వాలు పాకిస్థాన్‌‌పైన కనీస ఒత్తిడి కూడా తేకుండా మిన్నకుండిపోయిన సందర్భాలు మీకు తెలుసు.. కానీ నరేంద్రమోదీ దేశంలోని త్రవిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సర్జికల్‌‌ స్ట్రైక్‌‌తో పాక్‌‌కు.. టెర్రరిస్టులకు ఏవిధంగా బదులిచ్చారో మీ అందరికీ తెలుసునని చెప్పారు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఒక్క కాశ్మీర్‌‌లో తప్పితే దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 5 సంవత్సరాల కాలంలో ఒక్క బాంబ్‌‌ బ్లాస్ట్‌‌ గాని, టెర్రరిస్టుల దాడి గాని జరగలేదంటే నరేంద్రమోదీ ఎంత శక్తివంతమైన ప్రధానో అర్ధచేసుకోవాలన్నారు. ప్రజల మద్దతుతో నిజామాబాద్‌‌లో అర్వింద్‌‌ గెలుపుతో పాటు 300 పార్లమెంట్‌‌ సీట్లు గెలిచి నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాన మంత్రి కావడంఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో టీఆర్‌‌ఎస్‌‌ పతనానికి నాంది...

‒ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్‌‌ సూర్యనారాయణ గుప్త

మాయమాటలు చెప్పి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వానికి మూడు నెలలు తిరగకుండానే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థులను ఓడించి జనం బుద్ది చెప్పారని, ఇది టీఆర్‌‌ఎస్‌‌ పతనానికి నాంది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్‌‌ సూర్యనారాయణ గుప్త అన్నారు. దేశ భద్రత, ప్రజల భవిత కోసం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం లో డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ కలగానే మారిందని, ఇండ్లు ఇప్పిస్తామని ఎంపీ కవిత ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చెబుతున్న మాటలు బూటకం అని అన్నారు. ఇంటింటికి నీళ్ళివ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన కేసిఆర్ ఇప్పటికీ నీళ్ళివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర పథకాలను పేరు మార్చి రాష్ట్రం లో అమలు చేస్తున్నారని, నిజామాబాదు పార్లమెంట్‌‌ నుంచి ధర్మపురి అరవింద్‌‌ను గెలిపించి నరేంద్రమోదీకి కానుకగా పంపాలని పిలుపునిచ్చారు. మొన్న హైదరాబాదులో జరిగిన టీఆర్‌‌ఎస్‌‌ సభను ముగ్గురు మంత్రులు పర్యవేక్షించినా సభకు జనం రాక కేసిఆర్ వెనుదిరగడం చూస్తే టీఆర్‌‌ఎస్‌‌పై ప్రజలల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు.
ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు

‒ లోక భూపతిరెడ్డి

ఈ పార్లమెంట్‌‌ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలని బీజేపీ సీనియర్‌‌ నాయకులు లోక భూపతిరెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడని..కానీ కేసీఆర్‌‌, చంద్రబాబు, లేదా మమతా బెనర్జీల ఒరిగేదేమీ లేదన్నారు. కవితకు ఓటు వేస్తే ఆ ఓటు వృథా అవుతుందని, కేసీఆర్‌‌ ప్రభుత్వం 16 సీట్లు గెలిచినా కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి లేదన్నారు. ధర్మపురి అర్వింద్ గెలిపించి నరేంద్రమోదీకి కానుకగా ఢిల్లీకి పంపాలని ఆయన కోరారు.
1000 కోట్ల అభయహస్తం డబ్బలు ఏమయ్యాయి..?

‒ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ

30 లక్షల మంది మహిళలకు సంబందించిన రూపాయలు వెయ్యి కోట్ల అభయహస్తం పైసలు యాడికిపోయినయో ఎంపి కవిత సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలన్న కేసిఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ప్రజల చెవులల్లో పొద్దుతిరుగుడు పువ్వు పెడుతున్నారన్నారు. నిజాంసర్కార్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు..ఇప్పుడు కేసీఆర్ నవాబ్ సర్కార్‌‌లో కూడా మహిళలకు చోటు లేదని ఎద్దేవా చేశారు. ఏ అక్బరుద్దీన్‌‌ ఓవైసీ అయితే ఇదే నిజామాబాద్‌‌ సభలో మతపరమైన విద్వేషాలు రగల్చి వెళ్ళారో .. అటువంటి వారిని సంకలో అసదుద్దిన్‌‌ను.. నెత్తిపై అక్బరుద్దిన్ లను పెట్టుకున్న కేసిఆర్‌‌కు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గుడులను మసీదులు చేస్తున్న కేసిఆర్ సర్కార్కు వ్యతిరేకంగా బండెనక బండి కట్టి.. సైకిల్‌ మోటార్‌‌ వెనుక సైకిల్‌‌ మోటార్‌‌ కట్టి చుట్టుముడ్తామని హెచ్చరించారు. రైల్వే లైన్ పనులు పూర్తి చేయించిన ఘనత కవితది కాదని..మోదీదని పేర్కొన్నారు. వంద రోజులల్లో నిజాం షుగర్స్ ను తెరిపిస్తామన్న మాట నిలబెట్టుకోని ఎంపీ కవితను ఇంటికి పంపాల్సిందేనన్నారు. రాష్ట్రానికి కేంద్రం రెండు లక్షల70 వేల ఇండ్లు ఇస్తే కేసిఆర్ ప్రభుత్వం పది వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేసిందన్నారు. మోదీ ఇళ్ళు ఇవ్వడానికి సిద్దంగా ఉంటే కేసిఆర్ అడ్డంగా ఉన్నారని వివరించారు. అందుకే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్‌‌ఎస్‌‌ను ఓడించాలి.
దేశమంతటా ఔరేక్‌‌బార్‌‌.. మోదీ సర్కార్‌‌

‒ సీనియర్‌‌ బీజేపీ నాయకుడు అల్జాపూర్‌‌ శ్రీనివాస్‌‌

రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని అంటుంటారు... ఇది గత అసెంబ్లీ ఎన్నికలను చూస్తే నిజమేనని అనిపిస్తుందని, మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌‌ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు నేడు దేశమంతటా ఔరేక్‌‌బార్‌‌.. మోదీ సర్కార్‌‌ అనే నినాదంతో ఉన్నారని సీనియర్‌‌ బీజేపీ నాయకుడు అల్జాపూర్‌‌ శ్రీనివాస్‌‌ అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ను ఎంపీ కవిత ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కూతురు అయి ఉండి కూడా ఎర్రజొన్న, పసుపు రైతుల కష్టాలు పట్టించుకోకవడం శోచనీయమన్నారు. నెలల తరబడి రైతులు ఆందోళన చేస్తుంటే వారికి స్పష్టమైన భరోసా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎంత బాధ ఉంటే.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు 178 మంది రైతులు, ఎండనకా.. వాననకా కష్టపడి సంపాదించిన డబ్బులతో నామినేషన్‌‌ వేయడం కవితకు ఇంతకన్నా పెద్ద అవమానం లేదన్నారు. 100 రోజుల్లో తెరిపిస్తామన్న షుగర్‌‌ ఫ్యాక్టరీని ఇప్పటి వరకు తెరిపించకపోవటంతో ఇబ్బంది పడుతున్న రైతులకు మీరేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

No comments:

Post a Comment