Wednesday, 17 April 2019

విలేకరులపై ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమే !

‒ ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్  డాక్టర్ బి.కేశవులు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌‌ బి.కేశవులు
నిజామాబాద్‌‌ వార్త:   జగిత్యాలలో రాజ్యాంగ బద్ధంగా తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న  విలేకరులపై జిల్లా యంత్రాంగం పోలీస్ కేసులు పెట్టడమంటే ప్రభుత్వమే  భారతదేశ రాజ్యాంగ ప్రాథమిక  హక్కులను భంగ పరచడమేనని  ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు, ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్ బి. కేశవులు తెలిపారు. ఆయన జిల్లా కేంద్రంలోని ఖలీల్‌‌వాడిలో గల ఎన్నికల నిఘా వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కేశవులు ప్రసంగించారు.  ఈ చర్య ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన జర్నలిజం మూల స్తంభాన్ని  కట్టివేయడానికి  ప్రభుత్వాలు ప్రయత్నించడమే అవుతుందన్నారు. జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రాల ద్వారా, వీడియోల ద్వారా ప్రజలకు తెలియ పరచవలసిన బాధ్యత మీడియాకు ఉందన్నారు.  దీన్ని తప్పుడు చర్యగా యంత్రాంగము భావించడం.. విలేకరులపై    కేసులు నమోదు చేయడం నిరంకుశత్వ దోరణికి సంకేతమన్నారు.
ప్రభుత్వము ఇకనైనా ప్రజాస్వామ్య, -ప్రజా గొంతుకను మూసి వేయాలనుకోవడం , నిర్బంధించడం, కేసులు పెట్టడం లాంటివి మానుకోవాలని ఆయన హితవు పలికారు.  విలేకరులపై వేసిన  కేసులను బేషరతుగా విరమించుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని,  అలాగే ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు.   ఈ సమావేశంలో ఎన్నికల నిఘావేదిక సభ్యులు, డాక్టర్‌‌ కేశవులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment