Thursday, 18 April 2019

ఈవీఎంల సీల్‌‌ పరిశీలను అభ్యర్థులకు అనుమతి

జిల్లా కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు
నిజామాబాద్  వార్త:  స్ట్రాంగ్‌‌ రూంలో భద్రపరిచిన ఈవీఎంల సీల్‌‌ పరిశీలించుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై  అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు.  స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించుకోవడానికి మొదటి విజిట్ ఈనెల 23న, రెండవ విజిట్ మే 2, మూడవ విజిట్ మే 14న,  ఉదయం 11 గంటలకు  అవకాశం కల్పించామని కలెక్టర్  తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని ఈవీఎంలను డిచ్పల్లి మండలం సుద్ధపల్లి గ్రామంలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో భద్రపర్చామన్నారు.    ఈవీఎంలు భద్రపరచిన  స్ట్రాంగ్ రూమ్, వాటికి వేసిన తాళాలను, సీళ్లను అభ్యర్థులు పరిశీలించు కోవాలనుకుంటే  సూచించిన తేదీలలో  అభ్యర్థులు కానీ అనుమతించిన వారి అధికారిక ఏజెంట్లు కానీ వారికి జారీచేసిన గుర్తింపు కార్డులను చూపించి  పరిశీలించుకోవచ్చునన్నారు.  సెల్‌‌ఫోన్‌‌లను లోపలికి అనుమతి లేదన్నారు. 
  సీఎంసీ  కళాశాలలో ఈవీఎంలకు మూడంచెల  భద్రత కల్పించామన్నారు. ప్రజలు కానీ, అభ్యర్థులు కానీ ఈ విషయంలో  ఎలాంటి  వదంతులను నమ్మవద్దని కలెక్టర్  కోరారు. అబద్ధపు   వార్తలను వ్యాప్తి చేసే వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని  స్పష్టం చేశారు.

నేడు నీరుగొండ హనుమాన్ జయంతి ఉత్సవాలు

నిజామాబాద్‌‌ వార్త: నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల  నీరుగొండ హనుమాన్ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నట్లు హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భీమనాతి భూమయ్య తెలిపారు. ఆయన  గురువారం  స్థానిక ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హనుమాన్ జయంతి ఉత్సవాలతో పాటు శ్రీ శివ పంచాయతన సతీసమేత నవగ్రహా సప్తమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, ఆలయ చైర్మన్ ధన్‌‌పాల్ సూర్య నారాయణ గుప్తా, గర్భ గుడి దాత నరహరి తదితరులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఉదయం 5:45 గంటల నుండి  కార్యక్రమాలు ప్రారంభమౌతాయన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు, ఉత్సవ కన్వీనర్ పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి  బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో  బి.భూమయ్య

ఈనెల 24 నుంచి ఉచిత యోగా శిక్షణ శిబిరం

నిజామాబాద్‌‌ అర్బన్‌‌: నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని సుభాష్‌‌నగర్‌‌లో గల దయానంద యోగ కేంద్రంలో ఈనెల 24 నుంచి ఉచిత యోగా శిక్షణ శిబిరం  నిర్వహిస్తున్నట్లు దయానంద యోగ కేంద్రం  డైరెక్టర్‌‌ యోగ రాంచందర్‌‌ తెలిపారు.   గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని   ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.   ఉచిత యోగా శిక్షణ శిబిరం ఏప్రిల్ 24  నుంచి  వచ్చేనెల మే ఎనిమిదవ తేదీ వరకు 15 రోజులపాటు ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు పురుషులకు,  7:30 నుండి 8:30 గంటల వరకు పిల్లలకు, సాయంత్రం 5:00 నుండి 6: 15 గంటల వరకు మహిళలకు ఉంటుందన్నారు. అలాగే   6:15 గంటల నుండి 7:15 గంటల వరకు  ధ్యానము ఉంటుందని వివరించారు.  నిత్యజీవితంలో  ప్రతి ఒక్కరూ  ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారని, ఆరోగ్య విషయంలో అవగాహన అత్యవసరమని పేర్కొన్నారు.  గత 35 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా యోగ కేంద్రం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.  యోగ సాధనతో రోగనిరోధక శక్తి  పెంపొందుతుందన్నారు. నగర ప్రజలు శిబిరంలో పాల్గొని  ఆరోగ్యవంతులు కావాలని,  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విలేకరుల  సమావేశంలో యోగ భూమ గౌడ్, రుక్మణ్ రావు, అశోక్ కుమార్ పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న యోగ రాంచందర్‌‌

ఘనంగా హనుమాన్‌‌ ప్రతిష్ఠ కార్యక్రమాలు

నిజామాబాద్‌‌ వార్త:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌‌లో   54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గురువారం మొదలయ్యాయి.  మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా   ఊగింపు, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, పుణ్యహవాచనము, మాతృక, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండప స్థాపన, అగ్నిప్రతిష్ఠ, జలాదివాసం, పంచామృతధివాసం, హారతి, మంత్రపుష్పం, హనుమాన్ చాలీసా పారాయణం, తీర్థప్రసాద వితరణ భజన కార్యక్రమాలు అనంతరం అన్నదాన  కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్, పొద్దుటూరి గంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కొయ్యాడ శంకర్, డాక్టర్ ముత్యాల రవీంద్ర, కులాచారి సంతోష్,  కైరంకొండ మురళి, గుండ సతీష్ , వేములపాటి రవీంద్ర, శ్రీనివాస్ గౌడ్,   భక్తులు  పాల్గొన్నారు. 

54 అడుగుల హనుమాన్‌‌ విగ్రహం


మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామి

Wednesday, 17 April 2019

real life dhangal | అమ్మాయితో కుస్తీ పోటీలో ఓడిపోయిన యువకుడు }

real life dhangal |  అమ్మాయితో కుస్తీ పోటీలో ఓడిపోయిన యువకుడు }

కార్పొరేట్‌‌ పాఠశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌‌  వార్త: నిజామాబాద్‌‌ జిల్లా బెస్ట్‌‌ అవైలేబుల్‌‌ స్కూల్‌‌ స్కీము  కింద 2019‒20 విద్యా సంవత్సరమునకు గాను నూతన కార్పొరేట్‌‌ పాఠశాలలు ఎంపిక కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తు చేసే   విద్యాసంస్థలు ఈ క్రింది సదుపాయాలు, నియమ నిబంధనలను   తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
‒ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి
‒ పాఠశాల మెడికల్‌‌ సదుపాయము కలిగి ఉండాలి
‒ పాఠశాలలో క్వాలిఫైడ్‌‌ ఉపాధ్యాయులు ఉండవలెను.
‒ పాఠశాల గత 5 సంవత్సరాలలో 10వ తరగతిలో 90% ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే 50% మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
‒ పాఠశాల ఆర్‌‌సీసీ రూఫ్‌‌, మంచి ఫ్లోరింగ్‌‌ మరియు వెంటిలేషన్‌‌ కలిగి ఉండాలి.
‒ పాఠశాలలో డార్మిటరి అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరు వేరుగా ఉండాలి.
‒ తరగతులకు, వసతి గృహమునకు సరిపడు ఫర్నీచర్‌‌ ఉండాలి.
‒ టాయ్‌‌లెట్స్‌‌, బాత్రూంలు అమ్మాయిలకు, అబ్బాయిలకు 10:1 నిష్పత్తిలో సరిపడా ఉండాలి.
‒ పాఠశాలలో మంచి భోజనము, డైనింగ్‌‌ హాల్‌‌ ఉండాలి.
‒ పాఠశాల సరిఅయిన ప్లాన్‌‌తో నిర్మించి ఉండాలి.
దరఖాస్తు ఫారము, ఇతర వివరాల కోసం జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, రెండవ అంతస్తు, ప్రగతిభవన్‌‌ నిజామాబాద్‌‌ నందు సంప్రదించాలని సూచించారు. పూరించిన దరఖాస్తు ఫారాలను తగిన దృవీకరణలతో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయము, నిజామాబాద్‌‌ నందు సమర్పించాలని చెప్పారు. బాల్‌‌భవన్ లో చలివేంద్రం ప్రారంభం

నిజామాబాద్‌‌ వార్త: నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని బాల్‌‌భవన్‌‌లో వేసవి కాలాన్ని దృష్టి లో ఉంచుకొని ఇందూరు శంకర్,చెన్న గంగారత్నం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని  బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ గుప్త  ప్రారభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వందల మంది పిల్లలు బాలభవన్‌‌లో నిర్వహిస్తున్న సమ్మర్‌‌క్యాంప్‌‌లో పాల్గొంటారు వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్, సమోసా అందచేసి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బాల్‌‌భవన్‌‌ పర్యవేక్షకులు ప్రభాకర్‌‌, నగోళ్ల లక్ష్మీ నారాయణ,పోలీస్ శ్రీనివాస్,  విద్యార్థులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభిస్తున్న ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ గుప్త

చిన్నారులకు  సమోసాలు, స్వీట్లు పంచుతూ..

విలేకరులపై ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమే !

‒ ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్  డాక్టర్ బి.కేశవులు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌‌ బి.కేశవులు
నిజామాబాద్‌‌ వార్త:   జగిత్యాలలో రాజ్యాంగ బద్ధంగా తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న  విలేకరులపై జిల్లా యంత్రాంగం పోలీస్ కేసులు పెట్టడమంటే ప్రభుత్వమే  భారతదేశ రాజ్యాంగ ప్రాథమిక  హక్కులను భంగ పరచడమేనని  ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు, ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్ బి. కేశవులు తెలిపారు. ఆయన జిల్లా కేంద్రంలోని ఖలీల్‌‌వాడిలో గల ఎన్నికల నిఘా వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కేశవులు ప్రసంగించారు.  ఈ చర్య ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన జర్నలిజం మూల స్తంభాన్ని  కట్టివేయడానికి  ప్రభుత్వాలు ప్రయత్నించడమే అవుతుందన్నారు. జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రాల ద్వారా, వీడియోల ద్వారా ప్రజలకు తెలియ పరచవలసిన బాధ్యత మీడియాకు ఉందన్నారు.  దీన్ని తప్పుడు చర్యగా యంత్రాంగము భావించడం.. విలేకరులపై    కేసులు నమోదు చేయడం నిరంకుశత్వ దోరణికి సంకేతమన్నారు.
ప్రభుత్వము ఇకనైనా ప్రజాస్వామ్య, -ప్రజా గొంతుకను మూసి వేయాలనుకోవడం , నిర్బంధించడం, కేసులు పెట్టడం లాంటివి మానుకోవాలని ఆయన హితవు పలికారు.  విలేకరులపై వేసిన  కేసులను బేషరతుగా విరమించుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని,  అలాగే ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు.   ఈ సమావేశంలో ఎన్నికల నిఘావేదిక సభ్యులు, డాక్టర్‌‌ కేశవులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


రేపు శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర

 నిజామాబాద్‌‌ వార్త: శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర ను ఈనెల 19న శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇందూరు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్  తాడూరి వెల్లడించారు . ఈ మేరకు బుధవారం నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్ర శుక్రవారం ఉదయం పది గంటలకు కంఠేశ్వర్  నుంచి ప్రారంభమై జిల్లా పరిషత్, నాందేవ్ వాడ, శివాజీ చౌక్ , గంజ్ కమాన్, దేవి రోడ్డు, నెహ్రూ పార్క్, పెద్ద బజార్, లక్ష్మీ మెడికల్ మీదుగా గోల్ హనుమాన్ చేరుకుంటుందని పేర్కొన్నారు. రాముడు, హనుమంతుడు, శివుడు, దత్తాత్రేయుడు,  భరతమాత, శివాజీ విగ్రహాల శోభాయాత్ర  జరుపుతామన్నారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర  మంత్రి  పుల్ల సత్యనారాయణ, ప్రధాన వక్తగా డాక్టర్ సురేంద్ర జైన్ హాజరు కానున్నారని తెలిపారు .యాత్రలో పాల్గొనే భక్తులకు హిందూ బంధువులందరూ చల్లటి పానీయాలు, ప్రసాదాలు, తినుబండారాలు ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఇందూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు రామ్ స్వరూప్ దాలియా, బజరంగ్ దళ్ సహ సంయోజక్ రాజేష్ కుమార్, జిల్లా సహ కార్యదర్శి బోథ్ కిషన్, జిల్లా సంయోజక్ రాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న  ప్రవీణ్  తాడూరి 

హీమోఫీలియా వ్యాదిగ్రస్తులకు సహకరించాలి

నిజామాబాద్‌‌ వార్త: జన్యులోపము కారణంగా వచ్చే వ్యాది హీమోఫీలియా అని, ఈ వ్యాదిగ్రస్తులకు సమాజము, ప్రభుత్వము సహకారం అందించాలని హీమోఫీలియా సొసైటీ నిజామాబాద్‌‌ అధ్యక్షుడు డి.విజయానంద్‌‌ రావు అన్నారు. ఆయన బుధవారం హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో సుమారు 100 మందికిపైగా హీమో ఫీలియా వ్యక్తులు ఉన్నారన్నారు.   ఏదైనా ప్రమాదంలో దెబ్బతగిలి రక్తస్రావం జరిగితే రక్తం ఆగిపోకుండా కారుతూనే ఉండడం ఈ వ్యాది లక్షణమన్నారు.  ప్రతి ఒక్కరి రక్తంలో 13 రకాల రక్తం గడ్డకట్టేకారకాలు ఉంటాయని VIIIవ కారకము లోపము కారణంగా హీమోఫీలియా‒ఎ,  IX వ కారకముతో హీమోఫీలియా‒బి,  XI వ కారకము లోపము వలన హీమోఫీలియా‒సి వ్యాది వస్తుందని వివరించారు. ఈ వ్యాది  చికిత్స చాలా ఖర్చుతో కూడుకొందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వము హీమోఫీలియా వ్యాదిగ్రస్తులను  ఆదుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా హీమోఫీలియా వ్యాదిగ్రస్తులుంటే మా నెం. 9848484627కు ఫోన్‌‌ చేస్తే వారికి మా సంస్థద్వారా చేయూతనిస్తామని ఆయన పేర్కొన్నారు.  నిజామాబాద్‌‌ రెడ్‌‌క్రాస్‌‌ ఛైర్మన్‌‌ డాక్టర్‌‌ నీలి రాంచందర్‌‌ మాట్లాడుతూ..మా రెడ్‌‌క్రాస్‌‌ ద్వారా  తలసేమియా వ్యాదిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందిస్తున్నామని ఇప్పటి నుంచి హీమోఫీలియా వ్యాదిగ్రస్తులకు కూడా  ఉచితంగా రక్తం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యాదిగ్రస్తులకు చికిత్స, అవగాహన తదితర విషయాలలో సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో   హీమోఫీలియా నిజామాబాద్‌‌ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబరీష్‌‌ రావు, కార్యదర్శి గంగారాం, సంయుక్త కార్యదర్శి ఎ.సురేందర్‌‌రెడ్డి, కోశాధికారి ఎజాజ్‌‌ అహ్మద్‌‌ పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న  డాక్టర్‌‌ నీలి రాంచందర్‌‌

Monday, 15 April 2019

నిజామాబాద్‌‌ మాక్స్‌‌ క్యూర్‌‌ ఆస్పత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స

నిజామాబాద్‌‌ వార్త: సోమవారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని మాక్స్‌‌క్యూర్‌‌ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గుండె కవాటాలు పూర్తిగా మూసుకుపోయి సీరియస్‌‌గా ఉన్న పేషంట్‌‌ గుండెకు నిజామాబాద్‌‌ మాక్స్‌‌క్యూర్‌‌ డాక్టర్‌లు‌ ఆనంద్‌‌రాజ్‌‌, వెంకటేశ్వర రావులు అరుదైన శస్త్రచికిత్స చేసి కాపాడారు. వివరాల్లోకి వెళితే...
సారంగాపూర్‌‌కు చెందిన సావిత్రి (45) 15 రోజులుగా తీవ్రమైన దమ్ముతో బాధపడుతూ పలు ఆసుపత్రులలో సంప్రదించగా ఫలితం లేకపోయింది. ఇదే విషయమై ఆమె నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని మాక్స్‌‌క్యూర్ ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు ఆమెకు గుండె కవాటాలలో 1 చెడిపోయి పూర్తిగా మూసుకుపోయినట్లు గమనించారు. కుటుంబ సభ్యులని పిలిచి అత్యవసరంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించాల్సి వస్తుందని, పేషెంట్ పరిస్థితి వివరించారు. అందుకు వారు పేదవారమైన మేము డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని, ఏలాగైనా కాపాడాలంటూ కోరారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితిని గమనించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీని నిర్వహించామన్నారు. ఈ ఆపరేషన్‌‌లో డాక్టర్ విశాల్‌‌,కార్డియాక్ సర్జన్, డాక్టర్ సదానంద రెడ్డి, డాక్టర్ ఆనంద్ రాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు, కార్డియాలజిస్ట్ బృందం, అనస్తీషియా డాక్టర్ రవికిరణ్‌‌లు పాల్గొన్నారు.
ఉత్తర తెలంగాణలో ప్రప్రథమం..
 ఉత్తర తెలంగాణలోనే ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడం ప్రప్రథమమని డాక్టర్లు పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా ఓపెన్‌‌హార్ట్‌‌ సర్జరీ చేసినందుకు రోగి కుటుంబ సభ్యులు మ్యాక్స్‌‌క్యూర్‌‌ ఆస్పత్రి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ కంటే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆస్పత్రిలో ఇటువంటి సర్జరీలు మరిన్ని నిర్వహిస్తామని, అందుకు అనువైన ఆపరేషన్ థియేటర్, నర్సింగ్‌‌ బృందం తమ వద్ద ఉన్నాయన్నారు. నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ శ్రీనివాస్ శర్మ, స్వామి, విజయ్, పేషంట్‌‌ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాక్స్‌‌క్యూర్‌‌ డాక్టర్ల బృందం

Friday, 5 April 2019

బీజేపీలో చేరిన భైరాపూర్‌‌ యువకులు

 : మోపాల్ మండలంలోని భైరాపూర్‌‌కు చెందిన 100 మంది యువకులు బీజేపీలో చేరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.    ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బీజీపీ పార్టీ పటిష్ఠత కోసం, ధర్మపురి అరవింద్‌‌ను నిజామాబాద్‌‌ ఎంపీగా గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోపాల్  మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, భైరాపూర్‌‌ యువకులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరుతున్న భైరాపూర్‌‌ యువకులు

గల్ఫ్‌‌ బాధితులకు అండగా ఎంపీ కవిత

‒ జాగృతి జిల్లా యూత్‌‌ కో కన్వీనర్‌‌ దండు శ్రీకాంత్‌‌

  గల్ఫ్ దేశాలకు వెళ్ళి బాధలు ఎదుర్కొంటున్న ఎంతో మంది మన తెలంగాణ బిడ్డలను  నిజామాబాద్‌‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తిరిగి మన దేశానికి రప్పించి వారికి అండగా నిలిచారని  తెలంగాణ జాగృతి జిల్లా యూత్ కో కన్వీనర్ దండు శ్రీకాంత్‌‌ అన్నారు.  ఆయన జాగృతి ఆధ్వర్యంలో మోపాల్ మండలం చిన్నపూర్ తండా గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు.    కవితక్కను మరొక్క సారి నిజామాబాద్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జాగృతి యూత్ నాయకులు మనోహర్, దిలీప్, కార్తీక్, ప్రవీణ్, నితిన్,తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు ఓటేయాలని కోరుతూ...

ఉపాధి కూలీలకు ఓటేయాలని కోరుతూ...

వృద్దురాలితో..

జిల్లా ప్రజలకు సీపీ ఉగాధి శుభాకాంక్షలు

  జిల్లా ప్రజలకు నిజామాబాద్‌‌ సీపీ కార్తికేయ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావానికి గురికాకుండా..సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలందరూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ (లా అండ్‌‌ ఆర్డర్‌‌) జితేందర్‌‌ 

  రానున్న పార్లమెంట్‌‌ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ (లా అండ్‌‌ ఆర్డర్‌‌) జితేందర్‌‌ తెలిపారు.  శుక్రవారం ఆయన  నిజామాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌‌ హాలులో  నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోజరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అలాగే ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు తగు సూచనలు చేశారు. ఎన్నికల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి పూర్తిగా
అడిగి తెలుసుకున్నారు. 
 ఈ సమావేశంలో హైదరాబాద్‌‌ రీజియన్‌‌ ఐజీపీ ఎమ్‌‌.స్టీఫెన్‌‌ రవీంద్ర, నిజామాబాద్‌‌ రేంజ్‌‌ డీఐజీ ఎన్‌‌.శివశంకర్‌‌రెడ్డి, నిజామాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ కార్తికేయ, జగిత్యాల జిల్లా ఎస్‌‌.పి. హెచ్‌‌.సింధూశర్మ, నిజామాబాద్‌‌ అదనపు డీసీపీ (లా అండ్‌‌ ఆర్డర్‌‌) ఎమ్‌‌.శ్రీధర్‌‌రెడ్డి, నిజామాబాద్‌‌, ఆర్మూర్‌‌, బోధన్‌‌ ఏసీపీలు జి.శ్రీనివాస్‌‌కుమార్, ఎ.రాములు, ఎ.రఘు, మెట్‌‌పల్లి, జగిత్యాల డీఎస్‌‌పీలు మల్లారెడ్డి, వెంకటరమణ, నిజామాబాద్‌‌ స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ ఎస్‌‌.మధుసూదన్‌‌, జగిత్యాల స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ రాజశేఖర్‌‌ రాజు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌‌


అరవింద్‌‌ తరఫున నగరంలో బీజేపీ నేతల ప్రచారం

 నిజామాబాద్‌‌ బీజేపీ పార్లమెంట్‌‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌‌ తరఫున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యడు ధనపాల్‌‌ సూర్యనారాయణ గుప్త నగరంలోని జోన్‌‌1లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం మొత్తం మోదీ వైపు చూస్తూన్నారని,  ప్రతి పక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరన్నారు.  మాకు ప్రజల మీద పూర్తి నమ్మకం ఉందని.. ప్రజలంతా ధర్మపురి అరవింద్‌‌ వైపు ఉన్నారని పేర్కొన్నారు.  ఈనెల 11న  ప్రతి ఒక్కరు ఒకటవ నెంబరులోని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో బీజేపీ అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ప్రచారంలో ఆయనతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గీత రెడ్డి, జిల్లా మహిళా  అధ్యక్షురాలు కల్పన ఠాకూర్, అనిల్ కుమార్,శివయ్య, ప్రవీణ్ రెడ్డి,  బీజేపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

1వ జోన్‌‌లో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు


బాబు జగ్జీవన్‌‌ రామ్‌‌కు ఘన నివాళి

  నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి  సందర్భంగా ఘన నివాళులు  అర్పించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌‌లో గల ఆయన విగ్రహం వద్ద పూలమాలలు వేసి   నివాళులు అర్పించారు.

బీసీ సంఘం ఆధ్వర్యంలో... 

 బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌‌రామ్‌‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌‌ మాట్లాడుతూ ...  భారతదేశంలో ఎన్నో మార్పులకు ఆరాధ్యుడు  బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖ తీరుతెన్నులే మార్చేసి భారతదేశానికి ఒక దిశా నిర్దేశం చేసిన నాయకుడని కొనియాడారు.  ఈ రోజు భారతదేశం రక్షణ పరంగా ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం ఆయనేనన్నారు.  ప్రపంచవ్యాప్తంగా భారత దేశం ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి కారణం ఆయనేనని, కార్మికులకు కనీస వేతన ప్రదాత  జగ్జీవన్‌‌రామ్‌‌ అన్నారు.  భారతదేశాన్ని మొత్తం రైల్వేలో నంబర్ వన్ గా ఉంచిన దార్శనికుడని చెప్పారు. బాబు జగ్జీవన్ రామ్  దేశానికి చేసిన సేవలు ఈ రోజు వరకు కూడా  ఇంకా ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అటువంటి నేతలు మళ్లీ రావాలి భారతదేశం అభివృద్ధిపథంలో సాగాలని ఆశాబావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులకు జగ్జీవన్‌‌రామ్‌‌ మార్గదర్శి అని, ఆయన అడుగు జాడల్లో నడిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు.   నేటి నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంలా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా నిలబడుతుందని అధ్యక్షులు నరాల సుధాకర్ పేర్కొన్నారు. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  దర్శనం దేవేందర్‌‌, నగేష్, కొయ్యాడ శంకర్‌‌, సంజీవ్, కొట్టూరు చంద్రకాంత్‌‌, శ్రీలత, సురనార్ గంగాధర్, కె.శంకర్‌‌, అనిల్, బాలన్న, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌ ఆధ్వర్యంలో...

జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌‌ భవన్‌‌లో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌‌రెడ్డి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌‌రామ్‌‌ చిత్ర పటానికి పూలమాల వేసి కాంగ్రెస్‌‌ నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం నిజామాబాద్‌‌ కాంగ్రెస్‌‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ మాట్లాడుతూ జగ్జీవన్‌‌రామ్‌‌ అందరికీ గొప్ప మేధావి అని..ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.  నేటి రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ నాయకుడు మహేష్‌‌కుమార్‌‌ గౌడ్‌‌, కాంగ్రెస్‌‌ యూత్‌‌ ప్రెసిడెంట్‌‌ పంచరెడ్డి చరణ్‌‌, కాంగ్రెస్‌‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శశాంక్‌‌ ఫౌండేషన్‌‌ ఆధ్వర్యంలో..

జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌‌లోని రైల్వే బ్రిడ్జి వద్ద గల బాబు జగ్జీవన్‌‌రామ్‌‌ విగ్రహానికి పూలమాల వేసి శశాంక్‌‌ ఫౌండేషన్‌‌ ఛైర్మన్‌‌ డాక్టర్‌‌ మోతిలాల్‌‌ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..   ఒక అనాగరిక వర్గం నుంచి దేశ అత్యున్నతమైన ఉప-రాష్ట్రపతి పదవిలో భారత దేశానికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌‌రామ్‌‌ అని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి బాటలో నడిచి, వారి ఆశయ సాధన కోసం యువత  కృషి చేయాలన్నారు.  అణగారిన వర్గాల అభ్యున్నతికి బహుజనులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసు నాయక్, రాష్ట్ర కన్వీనర్ సంతోష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు జైత్రమ్ రాథోడ్, తెవివి అధ్యక్షుడు బాణోత్ సంతోష్ నాయక్,  చందర్ నాయక్, రవీందర్, శ్రీను , రాజేష్ మాల, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌‌  ఆధ్వర్యంలో... 

నిజామాబాద్‌‌ జిల్లా కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌‌లో గల బాబు జగ్జీవన్‌‌రామ్‌‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌‌రామ్‌‌ గొప్ప పరిపాలనా దక్షుడు అని ఆయన సూచించిన బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.  ఆయన వెంట జిల్లా అధికారులు, సిబ్బంది  ఉన్నారు.

అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త  ఆధ్వర్యంలో.. 

నిజామాబాద్‌‌ అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త ఆధ్వర్యంలో పాత అంబేద్కర్‌‌ భవన్‌‌ ఎదురుగా గల బాబు జగ్జీవన్‌‌రామ్‌‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఆయన వెంట నగర మేయర్‌‌ ఆకుల సుజాత, టీఆర్‌‌ఎస్‌‌ కార్పొరేటర్‌‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు
నివాళులు అర్పిస్తున్న బీసీ నాయకులు


నివాళులు అర్పిస్తున్న గిరిజన నాయకులు


బాబు జగ్జీవన్‌‌రామ్‌‌కు నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్‌‌ నాయకులు


కవిత గెలుపు కోసం సైనికుల్లా పని చేద్దాం

‒   రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్‌‌ రాగం సుజాత 

 రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో యాదవులందరూ  సైనికుల్లా పని చేసి నిజామాబాద్  ఎంపీ‌ అభ్యర్థి కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్‌‌, యాదవ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాగం సుజాత కోరారు.  ఆమె శుక్రవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో   జిల్లా యాదవ సంఘం అధ్యక్షురాలు మంజుల యాదవ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలలో పెద్దపీట వేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కూడా యాదవులకు టికెట్‌‌ కేటాయించడం పట్ల ఆమె హర్శం వ్యక్తం చేశారు. గతంలో  యాదవులకు రాజకీయ రంగం లో సరైన ప్రాధాన్యత  ఉండేది కాదని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యాదవులకు సముచిత స్థానం లభించిందన్నారు.  రాష్ట్రంలో యాదవులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ  యాదవుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ఎన్నికలలో 5 టికెట్లను ఇవ్వడం జరిగిందని, ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా యాదవుల సంక్షేమానికి  ప్రాధాన్యతనిచ్చిన ఒకేఒక్క సీఎం కేసీఆర్‌‌ కొనియాడారు.  రాజ్యసభకు కూడా యాదవ బిడ్డను పంపడం కేసీఆర్‌‌కే దక్కిందన్నారు.  జిల్లాలోని యాదవ కులస్తులందరూ ఏకతాటి పైకి వచ్చి కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా సభకు హాజరైన యాదవులు, సభికులు అందరూ  కవితను గెలిపించుకుంటామని  ప్రతిజ్ఞ చేశారు.    ఈ కార్యక్రమంలో  యాదవ సంఘo జిల్లా నాయకులు గోవురి ఒడ్డెన్న యాదవ్, గిరిధర్,  యాదవ కుల సర్పంచులు, జడ్పీటీసీలు,  శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు ఇతర నాయకులు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, జాగృతి నాయకులు, తదితరులు  పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్‌‌ రాగం సుజాత

మాట్లాడుతున్న యాదవ సంఘం జిల్లా  అధ్యక్షురాలు మంజుల యాదవ్‌‌

సభకు హాజరైన  యాదవులు

Thursday, 4 April 2019

ఈవీఎంల ద్వారానే పార్లమెంట్‌‌ ఎన్నికలు

‒ మీడియా సమావేశంలో కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

  ఈవీఎంల ద్వారానే ఈనెల11 న నిజామాబాదు లోకసభ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ప్రగతిభవన్‌‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  మొదటిసారిగా 12 బ్యాలెట్ యూనిట్స్ తో నిజామాబాదు లోకసభ ఎన్నిక జరగనుందని, ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది కంటే ఎక్కువ సిబ్బంది పనిచేయనున్నారన్నారు.  కావాల్సినన్ని ఈవీఎం లు, వీవి ప్యాట్స్ జిల్లాకు వచ్చాయన్నారు.  ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు  ముందుకు సాగుతున్నామన్నారు. చిన్న చిన్న  సమస్యలు వస్తున్నా పరిష్కారం చేస్తున్నామని,  12 బ్యాలెట్‌‌ యూనిట్లతో  జరుగుతున్న ఎన్నిక ఒక రికార్డ్ కానుందని పేర్కొన్నారు. నిజామాబాదు కొరకు ప్రత్యేక సూచనలు ఎన్నికల సంఘం ఇస్తుందని, పోలింగ్ గురించి ఓటర్లకు  లఘుచిత్రం, కరపత్రాలు, మాడల్ పోలింగ్ స్టేషన్, ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నామని వివరించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు నిబంధనల ప్రకారమే ఇచ్చామన్నారు. పారదర్శకత కోసం వివి ప్యాట్లతో ఎన్నికలు జరుపుతున్నాం‌మని, ఎన్నికల సంఘం సూచనలు ఆదేశాల మేరకు పోలింగ్ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మాక్ పోలింగ్ రెండు గంటలు పట్టే అవకాశం ఉందని, పోలింగ్ సమయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉండవచ్చునన్నారు. గడువు లోపు పొలింగ్ స్టేషన్ లకు వచ్చి క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. 

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌‌

కేసీఆర్‌‌ది హిట్లర్‌‌ పాలన

టిపిసిసి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
 రాష్ట్రం లో ప్రతిపక్షం ఉండకుండా చేస్తూ కేసీఆర్‌‌ హిట్లర్ పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టిపిసిసి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ఆమె పార్లమెంట్‌‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌‌ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు వెనుక ప్రజలున్నారని, టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీలు రెండూ ఒక్కటేనన్నారు. దేశం లో ఎన్నికల యుద్దం ప్రారంభం అయిందని, మోదీ‒కేసీఆర్‌‌లపై యుద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు గెలిపిస్తారనుకున్నాం...కానీ టీఆర్‌‌ఎస్‌‌ను గెలిపించారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌‌ పాలన కొనసాగడం లేదని, టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వానిది దోపిడీ పాలన అని విమర్శించారు. కేసీఆర్‌‌ కొడుకు, కూతురు, అల్లుడు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల అమయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్న కొడుకు, కూతురు అల్లుడుల దోపిడీకి ప్రజలు ఈ ఎన్నికలలో చరమగీతం పాడనున్నారని పేర్కొన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ పాలన అప్రజాస్వామికంగా సాగుతోందని.. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో పత్రికలపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. ఈ లోక్‌సభ ఎన్నికలలో అయినా ప్రజలు మేల్కొనాలని..ఈవీఎం లతో కాకుండా బ్యాలెట్ బాక్స్‌‌ల ద్వారానే న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జిల్లాలో రైతులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేస్తున్నా టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం పట్టించుకోవడం విడ్డూరమన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ పాలకులు రాష్త్రాన్ని అప్పుల తెలంగాణను చేశారని ధ్వజమెత్తారు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెసు ను గెలిపించాలని...రాహుల్ ప్రధాని అయితే దేశం బాగుపడుతదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ప్రస్తుత టీఆర్‌‌ఎస్‌‌ పాలనలో లేదని ఎన్నికలు న్యాయంగా జరిగితే కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌‌, జిల్లా కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు మానాల మోహన్‌‌రెడ్డి, సీనియర్‌‌ కాంగ్రెస్‌‌ నాయకులు తాహెర్‌‌బిన్‌‌ హుందాన్‌‌, గడుగు గంగాధర్‌‌, యూత్‌‌ కాంగ్రెస్‌‌ ప్రెసిడెంట్‌‌ పంచరెడ్డి చరణ్‌‌, కాంగ్రెస్‌‌ నగర అధ్యక్షుడు కేశవేణు, కాంగ్రెస్‌‌ నాయకులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న విజయశాంతి

నోటుకు ఓటు .. ప్రజాస్వామ్యానికి చేటు

  దేశ అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు  ఓటు ఎంతో కీలకమైందని, కానీ దురద్రుష్ట వశాత్తు నోటుకు ఓటును అమ్ముకొనే పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయని, నోటుకు ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో చేటు  ప్రొహిబిషన్‌‌  మరియు ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌ వెంకట్‌‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దార్థ పారామెడికల్‌‌ కళాశాలలో ఇందూరు యువత అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు హక్కు వినియోగంపై  అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.  ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వియోగం చేసుకోవాలని, అవినీతి రహిత భారతాన్ని నిర్మించేలా ఓటే ఆయుధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.  విశిష్ఠ అతిథిగా విచ్చేసిన ఎన్‌‌.వై.కె. ప్రాజెక్టు కో‒ఆర్డినేటర్‌‌ తులసీధర్‌‌ మాట్లాడుతూ ఓటు విలువ ప్రాధాన్యతను తెలుపుతూ ప్రజల్లో ఓటుపై చైతన్యం ఉన్నప్పటికీ ఓటు వినియోగంలో ముందుకు రావడం లేదన్నారు.   అనంతరం ఇందూరు యువత అసోసియేషన్‌‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు ఓటుపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌‌ పద్మ సుభాష్‌‌, కార్యదర్శి ప్రసాద్‌‌, కోశాధికారి సతీష్‌‌ గౌడ్‌‌, ఉపాధ్యక్షుడు వినయ్‌‌కుమార్‌‌,  విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగంపై పోస్టర్‌‌లు ప్రదర్శిస్తున్న విద్యార్థులు


సదస్సులో మాట్లాడుతున్న ప్రొహిబిషన్‌‌ అండ్‌‌ ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌ వెంకట్‌‌రెడ్డి 


వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ అధికారికి పీడీఎస్‌‌యూ వినతి
  వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఒడ్డెన్నకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌‌యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వేసవి సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచి, కేవలం మార్కులు, ర్యాంకులు, ఫీజులు, లాభాలే ధ్యేయంగా కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని ఆమె ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల్లో చదివే విద్యార్థులు ఒత్తిడి భరించలేక పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పేర్కొన్నారు. నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమెహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, నరేందర్, కోశాధికారి ప్రియాంక, నాయకులు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

డీఐఈవో ఒడ్డెన్నకు వినతిపత్రం ఇస్తున్న పీడీఎస్‌‌యూ నాయకులు

పది శాతం రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలి

రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి

: దేశంలో ఉన్న అగ్రవర్ణ పేదలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్‌‌ను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది శాతం రిజర్వేషన్లను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌‌లో అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనియెడల రాబోవు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాము రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటి స్తూన్నామని , అగ్రవర్ణ సోదరులలో పార్లమెంట్ ఎన్నికలపై చైతన్యం తీసుకువస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, అజయ్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏనుగు సంతోష్ రెడ్డి 

న్యాల్‌‌కల్‌‌లో కవిత తరఫున జాగృతి దండు శ్రీకాంత్ ప్రచారం

  మోపాల్ మండలంలోని న్యాలకల్ గ్రామంలో గురువారం తెలంగాణ జాగృతి జిల్లా యూత్ కో కన్వీనర్ దండు శ్రీకాంత్ ఆధ్వర్యంలో  ఇంటింటికి తిరుగుతూ  ప్రచారం నిర్వహించారు.   గత 50 ఏండ్ల నుంచి ఏ పార్టీ చేయని అభివృద్ధి టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం చేసిందని,   నిజామాబాద్‌ పార్లమెంట్‌‌ అభివృద్ధి కోసం  కవితక్క కోట్ల నిధులు తీసుకొచ్చారని, ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల గురంచి గ్రామస్థులకు వివరించారు. కారు గుర్తుకు ఓటేసి కవితక్కను గెలిపించుకొంటే.. రానున్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలోనే  అభివృద్ధి చెందిన పార్లమెంట్‌‌గా మన నిజామాబాద్‌‌ను నిలుపుతుందని  వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, తేజ, నాగరాజు , ప్రదీప్ ,సాయి నితిన్ తదితరులు పాలుగొన్నారు.

కాక.. నీ ఓటు కారు గుర్తుకే ఎయ్యాలె..

అవ్వా.. కాంగ్రెస్‌‌, బీజేపీ బూజును నీ చాటతో దుల్పెయ్యాలె..

అన్నా.. శెనార్థి.. కవితక్కకు ఓటెయ్యాలె..!!
ఆయి..  కవితక్కకు ఓటేస్తే డబల్‌‌ పింఛన్‌‌...మరి మర్చిపోకు..!!

బీజేపీ పాలనలో దేశం 20 సంవత్సరాలు వెనక్కి

యూత్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్‌‌

గత 5 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం 20 సంవాత్సరాల వెనక్కి వెళ్ళింది అని, నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని జిల్లా యూత్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్‌‌ అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌‌ భవన్‌‌లో జరుగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న బీద, మధ్యతరగతి ప్రజలు నోట్ల రద్దు వల్ల అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. జీ.ఎస్.టీ నిర్ణయం వల్ల దేశం లోని అనేక మంది చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల పై పన్ను భారం పెరిగి వాళ్ళు ఆర్ధికంగా కుదెలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2014 లోకసభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించకుండ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పాలనలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలు ఆకాశానికి అంటాయని పేద ప్రజలపై ధరల భారం పెరిగి ఆర్థికంగా చితికిపోయారని విషాదం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌కు ఓటు వేసి గెలిపిస్తే 5 సంవత్సరాలలో దేశం అన్ని రంగాల్లో ముందుకు నడుస్తుందని, 2019 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గనక ఒకసారి పరిశీలించి నట్టైతే దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం చేసారన్నారు. 2019,ఏప్రిల్1 నాటికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటానే యుద్ధప్రాతిపదికన మార్చి,2020 లోపు భర్తీ చేస్తుందని చెప్పారు. అలాగే పరిశ్రమలు,సేవారంగం , ఉద్యోగ కల్పనకు కొత్త మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తుందని, అర్హత కలిగిన యువతకు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి కల్పిస్తుందని వివరించారు. దేశంలోని యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తుందని, ఇంకా రైతులకు, పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించారని చెప్పారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని దేశ భవిష్యత్తుకి కాంగ్రెస్ భరోసా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, నవీన్ రెడ్డి, దత్తాద్రి, వరుణ్, వేదమిత్ర ప్రదీప్, పండరీ తదితరులుపాల్గొన్నారు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పంచరెడ్డి చరణ్‌‌

Wednesday, 3 April 2019

నేడు బీసీ ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళనం

  గురువారం  నిజామాబాదు నగర శివారులోని బోర్గాం(పి) భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో బిసి ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సాయంత్రం 5 గటలకు నిర్వహించడం జరుగుతుందని బీసీ ఐక్య వేదిక నాయకులు రాజారాం యాదవ్, నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కులాల సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. 

సమావేశంలో మాట్లాడుతున్న బీసీ ఐక్య వేదిక నాయకులు నరాల సుధాకర్‌‌

చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు

 డిప్యూటి ఎన్నికల కమిషనర్‌‌

 ప్రపంచంలో  ఇంత వరకు ఎం.3 ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించలేదని, ఇంత పెద్ద ఎత్తున 12   బ్యాలెట్‌‌ యూనిట్స్‌‌తో ఎన్నికలు నిర్వహించడం  ద్వారా  నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఎన్నికలు  చరిత్రలో నిలిచిపోతాయని కేంద్ర  డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ తెలిపారు.   బుధవారం ఆయన ఇతర కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి  నిజామాబాద్‌‌లో పర్యటించారు. ఈవీఎంల చెకింగ్ నిర్వహిస్తున్న  విజయలక్ష్మి   ఫంక్షన్ హాల్‌‌లో  ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఎన్.ఎల్.ఎమ్ టి ( నేషనల్‌‌ లెవెల్‌‌ మాస్టర్‌‌ ట్రైనర్స్‌‌) నిష్ణాతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల ద్వారా ఇంతవరకు దేశంలో  కేవలం ఎం.2  ద్వారా మాత్రమే నాలుగు బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో  ఎం.3 ఈవీఎంలతో ఒక్కొక్క  పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఎంతో చాలెంజ్‌‌తో కూడుకున్నదన్నారు. అతి తక్కువ సమయంలో  దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఒక మనందరికీ ఒక ఛాలెంజ్  తీసుకొని  ఎన్నికను ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూడాలన్నారు.  ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్ణీత సమయంలో  నిర్వహించడం కోసం సాంకేతిక నిపుణుల అవసరం అధికారుల శ్రమ అత్యంత కీలకమని తెలిపారు.  పొరపాట్లకు అవకాశం లేకుండా  అధికారులు పోలింగ్ అధికారులకు ఒకరోజు  పూర్తిస్థాయిలో సాంకేతికతతో  శిక్షణ అందించవలసి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో  ఒక కంట్రోల్‌‌ యూనిట్‌‌, ఒక వివి ప్యాట్‌‌,  12 బ్యాలెట్‌‌ యూనిట్లు ఉపయోగిస్తామన్నారు.  సాంకేతిక కారణాల వల్ల దేనివల్ల సమస్య వస్తే దానినే మార్చడానికి  అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంటే 12 బీయూలలో ఒక బ్యాలెట్ యూనిట్ సమస్య వస్తే దాని స్థానంలో  అక్కడే మరో బ్యాలెట్ యూనిట్ అమర్చాలని, దీనికి అవసరమైన సాంకేతికత చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతోమంది నిష్ణాతులు ఇప్పటికే అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఇక్కడ  విధులు నిర్వహిస్తున్నందున వారి సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. నిజామాబాదులో  5 అసంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను సిద్ధం చేస్తున్నామని, జగిత్యాలలో మరో రెండు నియోజకవర్గాలకు ఈవీఎంలను సిద్ధం చేయడంతో పాటు సాంకేతిక నిపుణులను  అందిస్తున్నామన్నారు. అధికారులు అత్యంత నమ్మకంగా ఈ విధులలో పాల్గొనాలన్నారు.  అనంతరం ఎన్నికల సంఘం కన్సల్టెంట్ నిఖిల్‌‌ కుమార్‌‌ మాట్లాడుతూ ఎన్నికల్లో షార్ట్ కట్స్ లేకుండా సరైన పద్ధతులు, నిబంధనల ప్రకారం సాంకేతిక నిపుణులు  నిర్వహించవలసి ఉంటుందన్నారు. వందల సంఖ్యలో భేల్ నిపుణులు ఈ ఎన్నికల్లో  విధులు నిర్వహిస్తూ ..సాంకేతిక సహకారం అందించనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్,  ఎన్నికల అధికారి   ఎం.రామ్మోహన్‌‌రావు  వచ్చిన అధికారులకు ఏర్పాట్లపై అన్ని విషయాలను వివరించారు. ఫంక్షన్ హాల్‌‌లో నిర్వహిస్తున్న ఈవీఎంల చెకింగ్ పక్రియ,  ఏర్పాట్లపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారుల సూచనల మేరకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు సకాలంలో తీసుకుంటున్నామన్నారు. ఈవీఎంలను మొదటి స్థాయి చెకింగ్‌‌ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో  అదనపు సీఈవో బుద్ధప్రకాష్‌‌, ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్ దాలియా,  ప్రత్యేక అధికారి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సి.పి కార్తికేయ, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, బిఎల్ ఈసీఐఎల్ ఇంజనీర్లు  మల్లన్న, నరేష్, కృష్ణ ప్రసాద్,   శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల చెకింగ్‌‌ గురించి కేంద్ర ఎన్నికల అధికారులకు వివరిస్తున్న కలెక్టర్‌‌

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటి ఎన్నికల కమిషనర్‌‌

పాల్గొన్న జిల్లా అధికారులు

బిసి కులాల ఐక్యవేదిక బహిరంగ సభను జయప్రదం చేయాలి

 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు గంగపుత్రుల సోదర సోదరీమణులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగపుత్ర సంఘం నగర అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య అన్నారు.   జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  గంగపుత్రులను టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని ఉచిత చేప పిల్లలు, మోటార్ సైకిల్ వాహనాలు అదేవిధంగా  కుల వృత్తి చేసుకునే అన్ని వసతులు కల్పించారన్నారు. జిల్లాలో ఉన్న గంగపుత్రులు అన్ని సంఘాలు కల్వకుంట్ల కవితకు సంపూర్ణ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. జిల్లా నలుమూలల నుండి గంగపుత్రులు పెద్ద ఎత్తున సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గంగపుత్రుల సంఘం నగర ప్రధాన కార్యదర్శి మాకు రవి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు మంజుల గంగాధర్, గాజులపేట సంఘం పాముల లక్ష్మణ్, ఎల్లమ్మ గుట్ట సంఘం కన్నం లక్ష్మణ్, వినాయక నగర్ సంఘం శంకర్,  కంటేశ్వర్ సంఘం అబ్బయ్య, గంగస్థాన్‌‌ సంఘం దాస్, రాము,  మల్లన్న, నరేష్, కృష్ణ ప్రసాద్,   శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న  పల్లికొండ అన్నయ్య

కంజర్‌‌లో తెలంగాణ జాగృతి ప్రచారం

 నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తరఫున  మోపాల్ మండలం కంజర్ గ్రామంలో  తెలంగాణ జాగృతి   జిల్లా ఉపాధ్యక్షుడు దండు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం  నిర్వహించారు. ప్రచారంలో బాగంగా టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అందిస్తున్న   బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు అందిస్తున్న పలు పింఛన్ పథకాలను గురించి వివరించారు. కారు గుర్తుకు ఓటేసి  నిజామాబాద్ ఎంపీగా మరోసారి   కల్వకుంట్ల కవితక్కను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల,గ్రామ నాయకులు బాసి బలరాం, గంగుల కార్తీక్, చిట్టి సాయికుమార్, దేవి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

అవ్వా ఎట్లున్నవ్‌‌.. పింఛన్‌‌ అస్తుందా..?

తాత.. పరేషాన్‌‌ గాకు.. కారు గుర్తుకు ఓటెయ్యు..

Tuesday, 2 April 2019

ఈవీఎం సహాయ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

- కలెక్టరేట్లో ప్రజలు, పోటీ చేసే అభ్యర్థుల కొరకు ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. రామ్మోహన్‌‌ రావు పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన 12 బ్యాలెట్ యూనిట్లను, కంట్రోల్‌‌ యూనిట్‌‌, వీవీ ప్యాట్‌‌ల పనితీరును పరిశీలించారు. కేంద్రానికి సమాచారం కోసం వచ్చే ప్రజలకు, ఓటర్లకు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల అనుమతులకు అభ్యర్థులు, వారి ఏజెంట్లు కనీసం 48 గంటల ముందుగా సువిధ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలని సిబ్బందికి కలెక్టర్ తెలిపారు. కలెక్టర్‌‌ వెంట శ్రీధర్, సమాచార శాఖ డి డి ముర్తుజా ఉన్నారు.పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

 నిజామాబాద్ లోక్ సభ పరిధిలో పోలింగ్ విధులు నిర్వహించుటకు సిబ్బందిని నియమిస్తూ కంప్యూటర్‌‌లో ర్యాండ మైజేషన్ పూర్తి చేశారు. మంగళవారం ఎన్. ఐ. సి.లో జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌ రావు, ఎన్నికల పరిశీలకులు గౌరవ దాలియా ఆధ్వర్యంలో ఈ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలకు గాను జగిత్యాల జిల్లాలో రెండు నియోజక వర్గాలు పోగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. 1438 ప్రిసైడింగ్ అధికారులు, 1438 సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 4314 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమిస్తూ రెండవ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమములో ఎన్‌‌.ఐ.సి. అధికారి రాజు, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..

కంప్యూటర్‌‌లో పోలింగ్‌‌సిబ్బంది ర్యాండమైజేషన్‌‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌‌

ఈవీఎంల చెకింగ్‌‌కు ఫంక్షన్ హాల్స్ పరిశీలన

 జిల్లాకు కొత్తగా చేరుకునే ఈవీఎంలను చెకింగ్ చేయడానికి ఫంక్షన్ హాల్‌‌లను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.మంగళవారం బోర్గాం వద్దగల శ్రీ విజయలక్ష్మి గార్డెన్‌‌, మాధవ నగర్ పరిధిలోగల సుగుణ గార్డెన్‌‌లను కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు, సాధారణ పరిశీలకులు గౌరవ దాలియా, సీపీ కార్తికేయ, బెల్ ఇంజనీర్లు పరిశీలించారు. బుధవారం జిల్లాకు అదనంగా బ్యాలెట్ యూనిట్లు రానున్నందున వాటిని ఫస్ట్ చెకింగ్ అనంతరం కమిషనింగ్‌‌ చేయుటకు పెద్ద హాలు అవసరం ఉన్నందున వీటిని ఎంపిక చేశారు. భద్రతాపరంగా కూడా ఈ ఫంక్షన్ హాల్స్ అనుకూలంగా ఉండడంతో వీటిని ఇక్కడ భద్రపరుచుటకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి టేబుల్ వద్ద 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్ను, వీవీ ప్యాట్‌‌ను ఏర్పాటు చేసి చెకింగ్ చేయనున్నారు. అదే విధంగా ప్రతి వరుసలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఈవీఎంలను చెకింగ్ అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇక్కడ నుండి పంపిస్తారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయుటకు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఫంక్షన్‌‌హాల్‌‌లను పరిశీలించిన వారిలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ డి.ఎస్.పి శ్రీనివాస్ కుమార్‌‌, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఫంక్షన్‌‌ హాల్‌‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు

యథావిధిగా ఈవీఎంల ద్వారానే ఎంపీ ఎలెక్షన్స్‌‌

‒కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ ఎన్నికలను ఏప్రిల్‌‌ 11న ఈవీఎం ల ద్వారా యథావిధిగా నిర్వహించనున్నామని కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఎలాంటి సందేహాలు లేకుండా తప్పక వీలు చేసుకొని మీ అమూల్యమైన ఓటు వేయాలని ఆయన సూచించారు. ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఓటు వేసే విధానం ఒక్కటేనని, ఒక బ్యాలెటింగ్ యూనిట్ ( ఓటువేసే మిషన్) బదులుగా 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి అంతే తేడా అని వివరించారు. కాబట్టి ఎలాంటి భయం, సందేహాలు, సంకోచాలూ లేకుండా గత ఎన్నికలలో లాగానే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బ్యాలెట్ (ఓటు వేసేది) ఉంటె జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. ఈ బ్యాలెట్ యూనిట్లన్ని ఓటింగ్ కంపార్ట్ మెంట్లో అమర్చబడుతాయని, మనం ఓటు వేసిన తదుపరి సరిచూసుకునే వి.వి.ప్యాట్ సరిగ్గా మధ్యలో అమర్చబడుతుందని చెప్పారు. ప్రజలు తప్పక ఓటు వేసి, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.ఎంపీ క‌విత‌కు పలు సంఘాల మద్దతు

నిజామాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు:  నిజామాబాద్ ఎంపీ  క‌విత‌కు తెలంగాణ బీడి టేకేదారుల సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర బీడి వ‌ర్కర్స్‌‌ యూనియ‌న్  మద్దతు ప్రకటించాయి.  మంగ‌ళ‌వారం నిజామాబాద్‌లోని ఎంపీ ఆఫీస్‌‌లో జ‌రిగిన కార్యక్రమంలో  సంఘాల నేత‌లు  ఎంపీ క‌విత‌ను క‌లిసి మ‌ద్దతు తెలిపారు. బీడి టేకేదారుల సంఘం రాష్ట్ర  గౌర‌వ అధ్యక్షుడు రూప్ సింగ్‌ మాట్లాడుతూ బీడీని  ప‌రిశ్రమగా గుర్తించి.. రాష్ట్రంలోని 4 ల‌క్షల మందికి  పెన్షన్‌‌ను ఇస్తున్న కేసీఆర్ దేవుడ‌న్నారు.  నిజామాబాద్ పార్లమెంట్ ప‌రిధిలోని మూడు వేల మంది టేకేదారులు, 2 ల‌క్షల మంది బీడి కార్మికులు  కారు గుర్తుకు ఓటేసి ఎంపీగా క‌విత‌ను మ‌ళ్లీ  గెలిపించాల‌ని తీర్మాణాలు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. తీర్మాణం కాపీని ఎంపీ క‌విత‌కు అంద‌జేశారు. ఎన్నిక‌ల ప్రచారం ఖ‌ర్చుల కోసం ఎంపీ క‌విత‌కు సంఘం త‌రఫున రూ.50 వేల చెక్కును అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో బోద‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ ఆమిర్‌, తెలంగాణ బీడి టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుంప‌ల స‌త్యనారాయ‌ణ‌, జిల్లా అధ్యక్షులు వేముల ల‌క్ష్మణ్‌,  తెలంగాణ బీడి వ‌ర్కర్స్ యూనియ‌న్ రాష్ట్ర అధ్యక్షురాలు కె. సుమ‌, ప్రధాన కార్యద‌ర్శి ఎం.డి షాహెదా,   సంఘం నాయ‌కురాలు విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు నాయ‌కులు  పాల్గొన్నారు.

మ‌ద్ధతు తెలిపిన క‌మ్మ సంఘం..
నిజామాబాద్ ఎంపి క‌ల్వకుంట్ల కవిత‌కు నందిపేట్ మండ‌లం ఆంధ్రాన‌గ‌ర్ క‌మ్మ సంఘం మ‌ద్ధతు తెలిపింది. అలాగే ప‌లు ఇతర సంఘాలు కూడా మ‌ద్ధతు తెలిపాయి. మంగ‌ళ‌వారం నిజామాబాద్ లోని ఎంపి కార్యాల‌యంలో ఎంపిని క‌ల‌సిన సంఘం నేత‌లు సంఘం చేసిన తీర్మాణాల ప్రతుల‌ను ఆమెకు అంద‌జేశారు. ఎంపి క‌విత‌ను మ‌ళ్లీ  భారీ మెజారిటీతో గెలిపించుకుంటామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక‌, నిజామాబాద్ ప‌ట్టణ గోసంగి కుల సంక్షేమ సంఘం, పాముల బ‌స్తీ మాల సంక్షేమ సంఘం, క‌మ్మ సేవా స‌మితి ఆంధ్రా న‌గ‌ర్‌, బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం  ఎంపి క‌విత‌కు మ‌ద్ధతు తెలిపాయి.


ఎంపీ కవితకు మద్దతు తెలుపుతున్న బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం సభ్యలు

మద్దతు తీర్మాణం ప్రతిని ఎంపీకి అందజేస్తున్న కమ్మ సంఘం ప్రతినిధులు


కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి

‒ కవిత మాస్కులతో వినూత్న ప్రచారం
నిజామాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని 43 వ డివిజన్‌‌లో కవిత మాస్కులు ధరించి ఇంటింటికి వినూత్న ప్రచారం నిర్వహించారు. 43 వ డివిజన్ లోని సంజీవయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ గుండా పలు కాలనీలలో పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా 41, 42 డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరితో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. నగర సుందరీకరణకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కోట్ల రూపాయలను తీసుకువచ్చి అన్ని చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కవితక్కను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత నిజామాబాద్ జిల్లా ప్రజలపై ఉందని, అందుకు ప్రజలందరూ ఆలోచించి కవితక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘు, రాములు యాదవ్, కనకయ్య యాదవ్, పంచ రెడ్డి సుమన్, రాజేష్ శ్రీనివాస్, ఫణీంద్ర రావు, రామకృష్ణ, నరేష్, నారాయణ, గంగాధర్, సత్యనారాయణ గౌడ్, సునీల్, పెద్ద సంఖ్యలో 43 వ డివిజన్ మహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.