Friday, 15 March 2019

ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌ వారు ప్రచార సామగ్రి వివరాలివ్వాలి

‒కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

   ఎన్నికల ప్రచారం కొరకు ముద్రించే సామగ్రి వివరాలు సంబంధిత ప్రింటర్స్‌‌ సమర్పించాలని జిల్లా కలెక్టర్‌‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రామ్మోహన్‌‌రావు తెలిపారు.
శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌‌ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌‌ 127‒ఎ ప్రకారం ఎన్నికలకు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బుక్‌‌లెట్లు తదితర ప్రచురణలు చేస్తే తప్పనిసరిగా వాటి వివరాలు రిటర్నింగ్‌‌ అధికారి లేదా ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. ప్రచురించిన సామగ్రి వివరాలు, తేది, ఎన్ని ప్రతులు ప్రచురించినదీ, వాటి ముద్రణ విలువ ఎంత, తదితర వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌‌ రూపొందించిన అపెండిక్స్‌‌ ఎ మరియు బి లలో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రచురణకు సంబంధించిన ప్రతులను కూడా జతచేయాలన్నారు.
ఈ నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా కాని, లేదా రెండూ ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్‌‌ లోక్‌‌సభకు సంబంధించిన ఈ వివరాలు కలెక్టరేట్‌‌లోని ఎన్నికల విభాగంలో సమర్పించాలని తెలిపారు. జిల్లాలో ప్రశాంతంగా, సమస్యలు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ, సహకారాలు అందించాలని, అదేవిధంగా ప్రింటింగ్‌‌, ఫ్లెక్సీ యజమానులు కూడా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ ప్రింటింగ్‌‌, ఫ్లెక్సీ ప్రెస్‌‌ల యజమానులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ఎం.రామ్మోహన్‌‌రావు

సమావేశంలో పాల్గొన్న, ప్రిటింగ్‌ ప్రెస్‌‌‌, ఫ్లెక్స్‌‌ ప్రింటర్స్‌‌ యజమానులు

No comments:

Post a Comment