Wednesday, 20 March 2019

ఎంపీ కవిత అమేథీలో పోటీ చేస్తే .. మా సంపూర్ణ మద్దతు

బాల్కొండ కాంగ్రెస్‌‌ ఇంఛార్జి ఈరవత్రి అనిల్‌‌

 ఆర్మూర్‌‌ పసుపు రైతులు అమోథీకి వెళ్ళి 1000 నామినేషన్‌‌లు వేయాలని ఎంపీ కవిత మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఆమె అమేథీలో పోటీ చేస్తే నిజామాబాద్‌‌ జిల్లా కాంగ్రెస్‌‌ ఆమెకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని బాల్కొండ కాంగ్రెస్‌‌ ఇంఛార్జి ఈరవత్రి అనిల్‌‌ అన్నారు.  నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అవ్‌‌ మేమూ అదే జెప్తున్నం.. రైతులు బాజప్త  నామినేషన్‌‌లు ఎయ్యాల. ఎందుకంటే వాళ్ళు కడుపు మండి ఉన్నరు..’ అని అన్నారు. ఈ పార్లమెంట్‌‌ ఎన్నికల్లో రైతులు తప్పకుండా టీఆర్‌‌ఎస్‌‌కు బుద్ధి చెప్తారన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ బీజేపీకి అనేక విషయాల్లో మద్దతిస్తూనే .. కాంగ్రెస్‌‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌‌ ఫ్రెడరల్‌‌ ఫ్రంట్‌‌ తీసుకొస్తానంటున్నారు కానీ .. గతంలో ఇలాగే అతుకుల పార్టీలు  అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశం సంక్షోభంలో కూరుకుపోతే కాంగ్రెస్‌‌ పార్టీ కష్టపడి మళ్ళీ దేశం అభివృద్ధి దిశగా పయనించేందుకు కృషి చేసిన విషయం ఆయన ఉదాహరణలతో సహా వివరించారు.  రాబోయే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్‌‌ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచి.. కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి రావాడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌‌రెడ్డి,  పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్‌‌కుమార్‌‌ గౌడ్‌‌, యూత్‌‌ కాంగ్రెస్‌‌ ప్రెసిడెంట్‌‌ పంచరెడ్డి చరణ్‌‌, కాంగ్రెస్‌‌ నగర అధ్యక్షుడు కేశవేణు, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment