Saturday, 9 March 2019

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: కలెక్టర్

   ఎన్నికల షెడ్యూలు ప్రకటన రాగానే ఎన్నికల విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు అధికారులను ఆదేశించారు.  శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఆర్. ఓ.లు., ఏఆర్‌‌వోలు, తహసీల్దారులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు, ఎల్‌‌.ఆర్.యు.పి, ప్రజల ఫిర్యాదులు, తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో  జారీచేసిన ఆదేశాల ప్రకారం లోక్ సభ ఎన్నికలకు ఎప్పుడైనా షెడ్యూలు ప్రకటించవచ్చు అన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈనెల 11 వరకు ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా, సత్యమైనది గా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా వచ్చిన అన్ని రకాల ఫారాలను పరిశీలన చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో ఉండకూడదని, డూప్లికేట్, లాజికల్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలన్నారు. ఎండాకాలంలో  ఎన్నికలు జరగనున్నందున అందుకు అనుగుణంగా తాగునీరు, షెడ్‌‌లతో పాటు  ముఖ్యంగా అర్బన్‌‌లో టాయిలెట్స్ సరి చూసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో  ర్యాంపులు సరిగా పనిచేసేలా చూడాలన్నారు. షెడ్యూలు రాగానే 24 గంటల్లో ప్రభుత్వ స్థలాలలో , 48 గంటలలో పబ్లిక్ స్థలాలలో, బస్సులలో, 72 గంటలలో ప్రైవేటు ఆస్తుల పై గల బ్యానర్లు, జెండాలు, పార్టీలకు సంబంధించిన ఇతరములు ఏవైనా ఉంటే తొలగించాలని తెలిపారు. అంతేకాక వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఈ దిశగా ఇప్పటికే నియమించబడిన ఎమ్.సి. సి, ఎఫ్.ఎస్‌‌.టి, ఎస్.ఎస్. టి, తదితర టీములు వారి విధులను ప్రారంభించవలసి ఉంటుందన్నారు. ఓటర్ల అవగాహనకు ప్రచార వాహనాలు తిరుగుతున్నందున వాటికి సంబంధించి ఫీడ్ బ్యాక్ రిపోర్ట్స్ పంపించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి రిపోర్టులు నిర్ణీత సమయంలో పంపాలని, ఎలక్షన్ సంబంధిత అధికారులు ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళ వద్దన్నారు. ఎన్నికల రూట్ మ్యాప్‌‌లు సిద్ధం చేసుకోవాలన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా పార్ట్‌‌‒బి సర్వే నంబర్లకు కోర్ట్ కేసులు ఉన్నవి  మినహాయించి మిగతా వాటికి సంబంధిత రైతులకు పాసు బుక్కులను వెంటనే ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాసుబుక్కులు తమ దగ్గర ఉంచుకొని రైతులకు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు. మీసేవ ద్వారా వచ్చిన కుల, ఆదాయ ధ్రువ పత్రాల జారీలో పెండింగ్ ఉంచకూడదు అన్నారు. వీటికి అదనపు చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి ఉత్తర్వులు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్‌‌

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న  అధికారులు

No comments:

Post a Comment