Saturday, 16 March 2019

విద్యార్థులు దేశ అభ్యున్నతికి పాటుపడాలి

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్‌‌ పాపిరెడ్డి
ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు సమాజసేవ అలవర్చుకోవాలని, తద్వారా దేశ అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌‌ పాపిరెడ్డి అన్నారు. ఆయన శనివారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌‌ హాల్‌‌లో జరిగిన నిషిత డిగ్రీ కళాశాల సిల్వర్‌‌ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నిషిత కళాశాల వ్యవస్థాపకుడు స్వర్గీయ భూమయ్య కృషి, పట్టుదల, అంకితభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. భూమయ్య.. కళాశాల పిల్లలను తన సొంత పిల్లలుగా భావించేవారన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు ఇచ్చేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరో ముఖ్య అతిథి తెలంగాణ యూనివర్సిటీ వైస్‌‌ ఛాన్స్‌‌లర్‌‌ పి.సాంబయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు ప్లేస్‌‌మెంట్స్‌‌ కల్పించడం అభినందనీయమన్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో డిమాండ్‌‌ ఉన్న ఏకైక డిగ్రీ కళాశాల నిషిత అని కొనియాడారు. టీఎస్‌‌సిహెచ్‌‌ఈ వైస్‌‌ ఛైర్మన్‌‌ ప్రొఫెసర్‌‌ ఆర్‌‌. లింబాద్రి మాట్లాడుతూ భూమయ్య చాలా దూర దృష్టి కలిగిన వ్యక్తి అని, 1994లో ప్రభుత్వ జూనియర్‌‌ కళాశాలల్లో డిమాండ్‌‌కు తగ్గట్లుగా సీట్లు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు డిగ్రీ చదవడానికి ఇబ్బందిపడే ఇబ్బందిపడే పరిస్థితి ఉండేదన్నారు. దీన్ని దూరదృష్టితో ఆలోచించి భూమయ్య అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ కళాశాలను ప్రారంభించారన్నారు. నాక్‌‌ (ఎన్‌‌.ఎ.ఎ.సి) ‘ఎ’ గ్రేడ్‌‌ సాధించిన ఏకైక డిగ్రీ కళాశాల నిషిత అని ఆయన కొనియాడారు. కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులను క్రమశిక్షణ, సాఫ్ట్‌‌ స్కిల్స్‌‌, కాన్ఫిడెన్స్‌‌ పెరిగే విధంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అందుకే కళాశాలకు ఇంతమంచి పేరు వచ్చిందన్నారు. అంతకు ముందు కళాశాల ఛైర్మన్‌‌ వినయ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ కళాశాలను మా నాన్న గారు కేవలం 36 మందితో మొదలు పెట్టారన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో, ఉపాధ్యాయుల కృషితో నేడు 2,300 విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందించే స్థాయికి చేరిందన్నారు. కళాశాలలో ప్రతి సంవత్సరం క్యాంపస్‌‌ ప్లేస్‌‌మెంట్స్‌‌ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఎందరో విద్యార్థులు మల్టీనేషనల్‌‌ కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రముఖ టీసీఎస్‌‌ కంపనీ 200 మందిని రిక్రూట్‌‌ చేసుకొంటే అందులో 120 మంది ఉద్యోగులు నిషిత విద్యార్థులు కావడం గర్వకారణమన్నారు. మా నాన్న గారు చనిపోయినా ఆయన ఆత్మ కళాశాల చుట్టూ తిరుగుతూనే ఉంటుందన్నారు. ఆయన ఆశయ సాధనకు, కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

అలరంచిన సాంస్కృతిక కార్యక్రమాలు


సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. విద్యార్థుల నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. ఈలలు.. గోలలు... స్టెప్పులతో స్టేజి దద్దరిల్లిపోయింది. అమ్మాయిల ఫ్యాషన్‌‌ షోలు అబ్బురపరిచాయి. ‘రౌడీ బేబి’ సాంగ్‌‌తో రచ్చరచ్చ చేసి.... ‘కమ్మారియా’ సాంగ్‌‌తో కుమ్మేశారు. అలాగే సాంప్రదాయ నృత్యాలతో స్పృశింపజేశారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన సినీ సింగర్స్‌‌ మాళవిక, దినకర్‌‌ల కమ్మని పాటలకు శ్రోతలు మైమరచిపోయారు.


కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్‌‌ పాపిరెడ్డి

కార్యక్రమంలోపాల్గొన్న  విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు 

విద్యార్థుల శాస్త్రీయ నృత్యం

యూనివర్సిటీ టాపర్‌‌కు సన్మానం

No comments:

Post a Comment