Thursday, 14 March 2019

ప్రజల గొంతుకనై నిలవడంలోనే ఆనందం

‒ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ

నిజామాబాద్‌‌ వార్త:  కంప్యూటర్‌‌ అప్లికేషన్స్‌‌, జర్నలిజంలో రెండు పోస్టు‌ గ్రాడ్యుయేషన్‌‌ డిగ్రీలు నాకు వ్యక్తిగతంగా అనేక ఉపాధి అవకాశాలిచ్చాయి. కానీ అన్యాయంగా వివక్షకు గురైన నా మాతృభూమి తెలంగాణ ప్రజల గొంతుకనై నిలవడంలో ఉన్న ఆనందం ముందు ఈ అవకాశాలేవీ నన్ను ఆకర్షింపలేకపోయాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ గోగుల అన్నారు.  గురువారం ఆమె నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో మనందరి అనుభవమేమిటి? ఉద్యమం కొందరికి పదవులిచ్చింది.. అనామకులకు సైతం అందలమెక్కించిందన్నారు. చివరకు తెలంగాణ ద్రోహులు సైతం మంత్రులై ఉద్యమకారుల నెత్తిమీద కూర్చున్నారని ఆమె ఎద్దేవా చేశారు. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ఒక స్థూపం కూడా దిక్కులేదు..తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ విగ్రహం ట్యాంక్‌‌బండ్‌‌పై పెట్టాలన్న సోయి కూడా మన నేతలకు లేదాయేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు కొలువులు రాలేదు...నోటిఫికేషన్‌‌లకై ఎదురుచూపులూ తప్పలేదు...కోచింగ్‌‌ సెంటర్లకు వేలకు వేలు తగలేయడం, కార్పొరేట్‌‌ కళాశాలల దోపిడీకి బలికావడం స్వరాష్ట్రంలో కూడా కొనసాగుతూనే ఉందన్నారు. కాంట్రాక్ట్‌‌ ఉద్యోగుల చాకిరీకి అంతంలేదు..ఔట్‌‌ సోర్సింగ్‌‌ దుర్మార్గం అలాగే ఉందని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు.. డీఎస్సీ ప్రకటన ఎండమావే అయిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  చిన్న చిన్న ప్రైవేటు సంస్థల్లో చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న వారికి ప్రత్యేక రాష్ట్రం ఏమిచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. మనరులు లేక కాదు.. పాలించే నేతల్లో చిత్తశుద్ధి కరువవడమే ఈ దుస్థితికి కారణమని ఆమె వివరించారు.
తెలంగాణ ధనిక రాష్ట్రంలో విద్యావంతులయిన పట్టభద్రులకే ఇన్ని సమస్యలుంటే.. ఇక సామాన్యుల సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు.  ఉద్యమం పేరు చెప్పుకొని ఉద్యోగాలు పొందిన రాజకీయ నాయకులు కనీసం అడుగుదామన్నా మనకు దొరకడం లేదు అని ఆమె వాపోయారు. అందుకే శాసనమండలిలోకి వెళ్ళి అడుగుదాం.. కొట్లాడదాం అని ఆమె పిలుపునిచ్చారు.
బ్యాలెట్‌‌ బాక్సులోని 3వ నెంబర్‌‌పై ఓటువేసి కరీంనగర్‌‌, మెదక్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె అభ్యర్థించారు.

విలేకర్ల సమావేశంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య యువజన సంఘం నాయకులు రవీందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాణీ రుద్రమ

No comments:

Post a Comment