Friday, 22 March 2019

బాస్కెట్‌‌బాల్‌‌ విజేత నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల

  కాలోజి నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌‌ హెల్త్‌‌ సైన్సెస్‌‌ ( కె.ఎన్‌‌.ఆర్‌‌.యు.హెచ్‌‌.ఎస్‌‌) ఆధ్వర్యంలో వరంగల్‌‌లో నిర్వహించిన ఫైనల్‌‌ పోటీలలో  నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల బాస్కెట్‌‌బాల్‌‌ జట్టు విజేతగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్‌‌ డాక్టర్‌‌ ఇందిర తెలిపారు. శుక్రవారం వరంగల్‌‌లో జరిగిన ఫైనల్స్‌‌లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌‌తో పోటీపడిన నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల బాస్కెట్‌‌బాల్‌‌ జట్టు విజేతగా నిలిచిందన్నారు. అలాగే కాకతీయ మెడికల్‌‌ కళాశాలతో జరిగిన బాడ్మెంటన్‌‌ సెమీఫైనల్స్‌‌లో గెలిచి  నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల విద్యార్థులు రన్నర్‌‌గా నిలిచినట్లు ఆమె పేర్కొన్నారు.  విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ మెడికల్‌‌ కళాశాల ప్రిన్సిపల్‌‌ డాక్టర్‌‌ సంధ్య బహుమతులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎంబీబీఎస్‌‌ ఫలితాలు విడుదల

 99 శాతం ఉత్తీర్ణత సాధించిన నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల 

ఎంబీబీఎస్‌‌ 2014 బ్యాచ్‌‌ ఫలితాలు విడుదలైనట్లు నిజామాబాద్‌‌ మెడికల్‌‌ కళాశాల ప్రిన్సిపల్‌‌ డాక్టర్‌‌ ఇందిర ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి, ఫిబ్రవరి‒2019లో జరిగిన ఫైనల్‌‌ ఎంబీబీఎస్‌‌ పరీక్షల్లో  మొత్తం 99 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 98 మందితో 99 శాతం ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. బి.వినయ్‌‌, జి.మాధురిలు డిస్టింక్షన్‌‌లో పాసయ్యారని అలాగే ఫస్ట్‌‌క్లాస్‌‌లో 36 మంది విద్యార్థులు, సెకెండ్‌‌ క్లాస్‌‌లో 60 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆమె వివరించారు. 

నీటిని పొదుపుగా వాడుకోవాలి


ఇందూరు యువత అసోసియేషన్‌‌ అధ్యక్షుడు సాయిబాబు

  నీరు జీవకోటికి ఆధారమని.. నీటిని పొదుపుగా వాడాలని ఇందూరు యువత అసోసియేషన్‌‌ అధ్యక్షుడు సాయిబాబు అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలోని  పి.ఎం. కె.వి. వై (ప్రధానమంత్రి కౌషల్‌‌ వికాస్‌‌ యోజన) కేంద్రంలో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన  అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి ఒక్కరు జల సంరక్షణను భాద్యతగా తీసుకోవాలన్నారు. నేటి యువత బాధ్యతను మరిచి ఎక్కడికక్కడ నీటిని వృధా చేస్తున్నారన్నారు.  నీటిని పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు.  ప్రతి ఒక్కరి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.   ఈసందర్భంగా ఆయన యువతీ యువకులతో  ‘జల సంరక్షణ ప్రతిజ్ఞ’ చేయించారు.  ఈ  సదస్సులో సంస్థ కార్యదర్శి ప్రసాద్‌‌,  సుభాష్,  సతీష్ గౌడ్, పి.ఎం. కె.వి. వై  రాజు, సిబ్బంది, యువతీ యువకులు పాల్గొన్నారు.వివాహిత మెడలోంచి గొలుసు దొంగతనం

  నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని  నాల్గవ టౌన్ పరిధిలోని చంద్రనాగర్ రోడ్డులో వివాహిత మెడలోంచి ఇద్దరు దుండగులు చైన్‌‌ లాక్కొని వెళ్ళారు.  నాల్గవటౌన్‌‌ ఎస్‌‌.ఐ నరేందర్‌‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...   జ్యోతి అనే వివాహిత తన తల్లి ప్రేమలతతో కలిసి శుక్రవారం సాయంత్రం చంద్రనాగర్ రోడ్డులో నడుచుకొంటూ వెళ్తున్నారు. బొందలగడ్డ కల్లు బట్టి సమీపంలో   నెంబరుప్లేటు లేని పల్సర్‌‌ బైక్‌‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు.  అక్కడే ఉన్న యువకులు అది గమనించి  దుండగులను వెంబడించగా వర్ని రోడ్ వైపు పరారై తప్పించుకున్నారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గవ టౌన్‌‌ ఎస్‌‌.ఐ  నరేందర్‌‌ తెలిపారు

సారంగాపూర్‌‌ హనుమాన్‌‌ని దర్శించుకొన్న ధర్మపురి అరవింద్‌‌

  నిజామాబాద్‌‌ నగర శివారులోని సారంగాపూర్ హనుమాన్‌‌ దేవాలయాన్ని  బీజేపీ పార్లమెంట్‌‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌‌ సతీసమేతంగా శుక్రవారం దర్శించుకొన్నారు. ఆయన నిజామాబాద్ బీజేపీ  ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు  సతీసమేతంగా  సారంగాపూర్‌‌ ఆంజనేయుడికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నామినేషన్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు.  అనంతరం మాట్లాడుతూ దేశం లో ప్రస్తుతం క్లిష్ట పరిస్తితులున్నాయి. మోదిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు. ఎన్ని పార్టీ లు కలిసినా మోదీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు.    నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసిన మధుయాస్కీ, కవితలు జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజలు నాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకొన్నారన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానన్నారు.  ఆయన వెంట   బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వాలక్ష్మీనర్సయ్య, ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ గుప్త, బీజేపీ జిల్లా నాయకులు ఉన్నారు.
సారంగాపూర్‌‌ హనుమాన్‌‌ని దర్శించుకొన్న ఎంపీ కవిత

 నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్‌‌ దేవాలయాన్ని సందర్శించి హనుమంతున్ని  దర్శించుకున్నారు.  శుక్రవారం  నిజామాబాద్ టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు  భర్త అనిల్‌‌తో కలిసి ఎంపీ కవిత సారంగాపూర్‌‌ ఆంజనేయుడికి  ప్రత్యేక పూజలు చేశారు.  నామినేషన్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. 
ఆమె వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు,  నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు  ఉన్నారు.Thursday, 21 March 2019

ఎన్నికల కాల్‌‌సెంటర్‌ను‌ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌‌

 పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్  జారీ చేసినందున ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్  ఎం.రామ్మోహన్‌‌రావు  కలెక్టరేట్‌‌లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్‌‌ను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, వాటి పరిష్కారాలు ఏ విధంగా చేస్తున్నారు అని ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు.  ఎన్నికలకు  సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినా   ఎం.సి.సి. నిఘా బృందాలకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.  అదేవిధంగా పి.డబ్ల్యు.డి సంబంధించిన బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సెంటర్‌‌ను సందర్శించి పెయిడ్ న్యూస్, లోకల్ కేబుల్లో వచ్చే వార్తలను పరిశీలించాలని  డీపీఆర్‌‌వో మహమ్మద్ ముర్తుజాను ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. సిబ్బంది సంబంధిత పోలింగ్ స్టేషన్లకు  సురక్షితంగా చేరుకున్న విషయాన్ని సంబంధిత ఆర్డీవోలను అడిగి సమాచారం అందించాలని కలెక్టరేట్‌‌ సూపరింటెండెంట్‌‌ గఫార్‌‌ను ఆదేశించారు.హోలీ జోష్‌‌..! ఇందూరు ఖుష్‌‌..!!

‒ నగరంలో  ఘనంగా హోలీ సంబరాలు

నిజామాబాద్‌‌ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా... అందరూ ఆప్యాయంగా రంగులు చల్లుకొన్నారు. యువత డీజే డ్యాన్సులతో ఇరగదీసారు... ఆకాశమే హద్దుగా... రెచ్చిపోయి ఎంజాయ్‌‌ చేశారు. శిశిర రుతువుకు వీడ్కోలు పలుకుతూ.. వసంత రుతువుకు రంగు రంగుల హోలీతో స్వాగతం పలికారు. స్నేహితులు, బంధువుల ఇండ్లలోకి వెళ్ళి ఒకరినొకరు రంగులు చల్లుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌‌ ఆధ్వర్యంలో గోగిపువ్వుతో తయారు చేసిన నేచురల్‌‌ రంగులు చల్లుకొని.. ఆనవాయితీగా వస్తున్న మడ్‌‌బాత్‌‌ చేశారు. హోలీ సందర్బంగా నగరంలోని గల్లీలు రంగుల దుకాణాలతో సందడిగా మారాయి. రంగులు, మాస్కులు, వాటర్‌‌ పిస్టళ్ళు, రంగురంగుల విగ్గుల అమ్మకాలు జోరుగా సాగాయి. హోలీ పండుగకు ఉత్తరాది రాష్ట్రాలు ప్రసిద్ది. అయితే ఇందూరులో కర్ణాటక, ఆంధ్రపదేశ్‌‌, మహారాష్ట్ర, గుజరాత్‌‌, రాజస్థాన్‌‌, పంజాబ్‌‌ రాష్ట్రాల ప్రజలు నివసిస్తుంటారు.. వీరందరూ గురువారం హోలీ సంబరాల్లో మునిగితేలడంతో హోలీ జోష్‌‌లో ఇందూరు మస్తు ఖుష్‌‌ అయింది.

ఒకే పార్లమెంట్ పరిధిలో ఓటు, డ్యూటీ ఉంటే..

 నేరుగా ఓటు వేసే సదుపాయం-- కలెక్టర్

పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఓటు అదే పార్లమెంటు పరిధిలో విధులు నిర్వహిస్తే నేరుగా ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.రామ్మోహన్‌‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఒక ఉద్యోగి అదే పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్నా సరే తాను విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఉదాహరణకు నిజామాబాద్ లోక్ సభ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉద్యోగి ఓటు ఒక నియోజకవర్గంలో ఉంటే అతను అదే పార్లమెంటు నియోజకవర్గంలోని వేరే అసెంబ్లీ నియోజకవర్గంలో విధులలో ఉన్నప్పటికీ తాను విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే నేరుగా ఓటును ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. నేరుగా ఇతర ఓటరులాగే ఓటు వేయవచ్చు అన్నారు. ఇందుకుగాను ఆ సిబ్బంది తన రెండవ విడత ఎన్నికల శిక్షణ విధుల్లో కానీ, లేదా తమ శాఖ నోడల్ అధికారి ద్వారా గాని, ఫారం 12 ఏ సమర్పించాలన్నారు. అందులో తన ఓటు కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలన్నారు. తద్వారా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆ ఉద్యోగికి ఫారం 12b ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ధ్రువ పత్రాన్ని ఇస్తుందని తెలిపారు. ఆ ఉద్యోగి తాను విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారికి ఫారం 12b అందించి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు అన్నారు. ఒకవేళ ఆ సిబ్బంది ఓటు వేరే పార్లమెంట్ పరిధిలో ఉంటే అతను పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పిల్లలతో హోలీ జరుపుకోవడం సంతోషం-‒ కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు

అనాధ పిల్లలతో హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్‌‌ రావు తెలిపారు. ఆయన గురువారం హోలీ పండుగ సందర్భంగా డిచ్‌‌పల్లిలోని మానవతా సదన్‌‌కు సతీ సమేతంగా హాజరయ్యారు. పిల్లలతో రంగులు చల్లించుకొని వారికి కూడా కలెక్టర్ దంపతులు రంగులు పోశారు. పిల్లలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కొంత సమయం వారితో ఆహ్లాద వాతావరణంలో గడిపారు. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ పిల్లలు దేవుడితో సమానం అంటారు.. ఎటువంటి కల్మషం లేకుండా వారి మనసులు స్వచ్ఛంగా ఉంటాయన్నారు. వారితో ఎంతసేపు గడిపినా ఆనందంగా ఉంటుంది అన్నారు . వారితో గడపడం వల్ల అన్నీ మరిచిపోయి ప్రశాంతత పొందడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు . సంతోష వాతావరణంలో ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా, రసాయనాలు కలవని రంగులతో హోలీ నిర్వహించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. కలెక్టర్ వెంట సుధాకర్ రావు, మానవ సదన్ ఇంచార్జ్, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 20 March 2019

మూడో రోజు 7 నామినేషన్‌‌లు


  నిజామాబాద్‌‌ ఎంపీ పార్లమెంట్‌‌ స్థానానికి మూడోరోజు అయిన బుధవారం ఏడు నామినేషన్‌‌లు దాఖలయ్యాయి.  నామినేషన్‌‌ వేసిన ఏడుగురు అభ్యర్థులూ స్వతంత్ర అభ్యర్థులే. 
నామినేషన్‌‌ వేసిన అభ్యర్థుల వివరాలు:
క్ర.సం.                                           అభ్యర్థి పేరు                                    పార్టీ                                               
1                  రాపెళ్ళి శ్రీనివాస్,  నిజామాబాద్ స్వతంత్ర
2 జైడి చిన గంగారాం, బద్దం వాడ,  మోర్తాడ్ స్వతంత్ర
3 ఏనుగు మల్లేష్, బద్దం వాడ, మోర్తాడ్ స్వతంత్ర
4 సామ తిరుపతి, కల్లెడ, జగిత్యాల స్వతంత్ర
5 నోముల గోపాల్ రెడ్డి, లక్మిదేవిపల్లి, సారంగాపూర్ స్వతంత్ర
6 తిరుపతి పన్నాల, లక్ష్మీపూర్‌‌, జగిత్యాల స్వతంత్ర
7 వెంకటేష్ పొల, సుభాష్ నగర్, ఆర్మూర్. స్వతంత్ర

జిల్లా ప్రజలకు కలెక్టర్‌‌ హోలీ శుభాకాంక్షలు-

  బంధుమిత్రులతో జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్  ఎం.రామ్మోహన్‌‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకునే హోలీ పండుగను  ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. రసాయనాలు లేని రంగులను  ఉపయోగించుకోవాలని కలెక్టర్  సూచించారు. చెడుపై విజయమే హోలీ పండుగ ఉద్దేశమని, కామ దహనం  అనంతరం జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని  కోరుకుంటున్నానన్నారు.

ఉపాధ్యాయ పక్షపాతి భట్టాపురం మోహన్‌‌రెడ్డి


ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి.. ఎన్నో ప్రయోజకరమైన జీవోలు తీసుకొచ్చిన  ఉపాధ్యాయ పక్షపాతి మన భట్టాపురం మోహన్‌‌రెడ్డి అని పీఆర్‌‌టీయూ రాష్ట్ర మాజీ అసోసియేట్‌‌ అధ్యక్షుడు వి.నర్సింగ్‌‌రావు అన్నారు. ఆయన బుధవారం నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఉపాధ్యాయుల సంక్షేమానికి మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్‌‌రెడ్డి చేసినంత కృషి గతంలో ఎవ్వరూ చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం  మీ మొదటి ప్రాధాన్యత ఓటును భట్టాపురం మోహన్‌‌రెడ్డికి వేసి ఉమ్మడి మెదక్‌‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు సత్యం రెడ్డి, గంగారెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.


ఎంపీ కవిత అమేథీలో పోటీ చేస్తే .. మా సంపూర్ణ మద్దతు

బాల్కొండ కాంగ్రెస్‌‌ ఇంఛార్జి ఈరవత్రి అనిల్‌‌

 ఆర్మూర్‌‌ పసుపు రైతులు అమోథీకి వెళ్ళి 1000 నామినేషన్‌‌లు వేయాలని ఎంపీ కవిత మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఆమె అమేథీలో పోటీ చేస్తే నిజామాబాద్‌‌ జిల్లా కాంగ్రెస్‌‌ ఆమెకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని బాల్కొండ కాంగ్రెస్‌‌ ఇంఛార్జి ఈరవత్రి అనిల్‌‌ అన్నారు.  నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అవ్‌‌ మేమూ అదే జెప్తున్నం.. రైతులు బాజప్త  నామినేషన్‌‌లు ఎయ్యాల. ఎందుకంటే వాళ్ళు కడుపు మండి ఉన్నరు..’ అని అన్నారు. ఈ పార్లమెంట్‌‌ ఎన్నికల్లో రైతులు తప్పకుండా టీఆర్‌‌ఎస్‌‌కు బుద్ధి చెప్తారన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ బీజేపీకి అనేక విషయాల్లో మద్దతిస్తూనే .. కాంగ్రెస్‌‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌‌ ఫ్రెడరల్‌‌ ఫ్రంట్‌‌ తీసుకొస్తానంటున్నారు కానీ .. గతంలో ఇలాగే అతుకుల పార్టీలు  అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశం సంక్షోభంలో కూరుకుపోతే కాంగ్రెస్‌‌ పార్టీ కష్టపడి మళ్ళీ దేశం అభివృద్ధి దిశగా పయనించేందుకు కృషి చేసిన విషయం ఆయన ఉదాహరణలతో సహా వివరించారు.  రాబోయే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్‌‌ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచి.. కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి రావాడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌‌రెడ్డి,  పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్‌‌కుమార్‌‌ గౌడ్‌‌, యూత్‌‌ కాంగ్రెస్‌‌ ప్రెసిడెంట్‌‌ పంచరెడ్డి చరణ్‌‌, కాంగ్రెస్‌‌ నగర అధ్యక్షుడు కేశవేణు, తదితరులు పాల్గొన్నారు.


బీజేపీ‒కాంగ్రెస్‌‌కు మధ్యనే పార్లమెంట్‌‌ ఎన్నికలు

 గత అంసెబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టి.ఆర్‌‌.ఎస్‌‌కు మెజారిటీ ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారని, కానీ పార్లమెంట్‌‌ ఎన్నికలు అందుకు భిన్నమని ఈ ఎన్నికలు బీజేపీ‒కాంగ్రెస్‌‌కు సంబంధించినవని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు.  బుధవారం ఆయన జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన సభలో ఎంపీ కవిత కాంగ్రెస్‌‌, బీజేపీలు ఆర్మూర్‌‌ రైతులతో ఆడుకొంటున్నరని మాట్లాడారని, రైతుల బాధను అర్థం చేసుకోకుండా వాళ్ళపై నాన్‌‌బెయిలెబుల్‌‌ కేసులు పెట్టి అరెస్టు చేయించింది మీరు కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.  రెండున్నర సంవత్సరాల క్రితం ఎంపీ కవిత కేంద్రం ఏంది ఇచ్చేది.. మేమే 30 కోట్ల రూపాయలు ఇచ్చి పసుపును కొనుగోలు చేస్తామని మాట ఇచ్చిన విషయం మర్చిపోయి.. ఇప్పుడు మాపై రుద్దడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్మూర్‌‌ రైతులకు తప్పకుండా న్యాయం చేస్తుందని, పార్లమెంట్‌‌ ఎన్నికలకు ముందే వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త అందజేస్తారని ఆయన తెలిపారు. కేసీఆర్‌‌ బాధ్యత గల ముఖ్యమంత్రిగా మాట్లాడటం లేదన్నారు.  ఒక వర్గాని తలొగ్గి.. వారితో దోస్తీ చేసే కేసీఆర్‌‌కు హింధుత్వం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బస్వా లక్ష్మినారాయణ, ధనపాల్‌‌ సూర్యనారాయణ గుప్త, బీజేపీ కార్పొరేటర్‌‌లు తదితరులు పాల్గొన్నారు.


Monday, 18 March 2019

నామినేషన్‌‌ల స్వీకరణకు నోటిఫికేషన్‌‌ జారీ

‒ మొదటిరోజు నామినేషన్‌‌లు నిల్‌‌

పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా నామినేషన్ల పక్రియను కొనసాగించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఎం.రామ్మోహన్‌‌రావు సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఈనెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 21,23 , 24 తేదీలలో నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవులు ఉన్నందున ఆయా తేదీలలో నామినేషన్లు స్వీకరించబడవు. నామినేషన్ల ప్రక్రియ పై అవగాహన కల్పించే సహాయ కేంద్రం నుండి నేడు 43 మంది నామినేషన్ పత్రాలను తీసుకెళ్ళారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మొదటిరోజు నామినేషన్లు ఎవరూ వేయలేదని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు తెలిపారు.

నామినేషన్‌‌ల స్వీకరణకు నోటిఫికేషన్‌‌ జారీ చేస్తున్న కలెక్టర్‌‌

తెలుగు,  ఉర్దూ, ఇంగ్లీష్‌‌లలో పార్లమెంట్‌‌ ఎన్నికల నోటిఫికేషన్‌‌ నోటీస్‌‌బోర్డు

కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన నామినేషన్‌‌ సహాయక కేంద్రం

జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు


  నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు కేటాయించిన వ్యయ పరిశీలకులు సోమవారం జిల్లాకు చేరుకున్నారు.
2014 బ్యాచ్‌‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారులు ఎం. కిరణ్ మోహన్ ను   నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోని బాల్కొండ, కోరుట్ల , జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు,   ప్రకాష్‌‌ను ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు పరిశీలకులుగా భారత ఎన్నికల సంఘం  నియమించిందని కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. 

కొనసాగుతున్న పోలీస్‌‌ కానిస్టేబుల్‌‌, ఎస్‌‌.ఐ దేహదారుఢ్య పరీక్షలు

  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  నాగారం మైదానంలో  ఎస్‌‌.ఐ, కానిస్టేబుల్‌‌ ఎంపిక దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.  13వరోజు  అయిన సోమవారం మొత్తం 1000 మంది  స్త్రీ, పురుష అభ్యర్థులను ఎంపిక కోసం పిలవగా 955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.   అభ్యర్థులకు పరుగు పందెం, లాంగ్‌‌జంప్‌‌, హైజంప్‌‌, ఎత్తు, ఛాతి డిస్కస్‌‌త్రో తదితర పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  మంచినీటి సౌకర్యం, అందుబాటులో మెడికల్‌‌ టీం, అంబులెన్స్‌‌ ఏర్పాటు చేశారు.మనోహర్‌‌ పారికర్‌‌కు శ్రద్ధాంజలి

   నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌‌కు  జిల్లా భాజపా నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి  మాట్లాడుతూ నేటి యువతకు మనోహర్‌‌ పారికర్‌‌ ఆదర్శం అన్నారు.      ఏ స్థాయికి వెళ్లినా తాను ఒక సామాన్య కార్యకర్తనని  మర్చిపోకుండా సమాజహితం కోసం పనిచేసిన  మహనీయులని అన్నారు.  ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా,  దేశ రక్షణ మంత్రి స్థాయిలో ఉన్నా  తాను ఒక సామాన్య కార్యకర్తగా మెదిలే మహోన్నతమైన వ్యక్తి  మనోహర్ పారికర్  అని కొనియాడారు.   ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటన్నారు.  కార్యక్రమంలో  భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్,  ధనపాల్ సూర్య నారాయణ, బస్వా లక్ష్మీ నర్సయ్య, యెండల సుధాకర్,  మల్లేష్ యాదవ్,  భరత్ భూషణ్, స్వామి యాదవ్‌‌, సుగుణ, గంగాధర్‌‌, కొత్త వేణు, గడ్డం రాజు, ఆకుల శ్రీనివాస్, సాయి రెడ్డి, బద్దం కిషన్ తదితరులు పాల్గొన్నారు.
మనోహర్‌‌ పారికర్‌‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న భాజపా నాయకులు

తెలంగాణ ప్రజా ఫ్రంట్ రౌండ్ టేబుల్ సమావేశం

  బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని- సారంగాపూర్ చక్కర కర్మాగారాలను పునరిద్దరించాలని కోరుతూ తెలంగాణా ప్రజా ఫ్రంట్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ  సమావేశానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వి. రాఘవులు అధ్యక్షత  వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఆర్ముర్‌‌లో పసుపు బోర్డ్ ను ఏర్పాటు చేయాలని , పసుపు ,ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్  చేశారు. అనంతరం  వివిధ పార్టీల, సంఘాల నాయకులు మాట్లాడుతూ టి.ఆర్‌‌.ఎస్‌‌. పాలకులు బంగారు తెలంగాణ అని చెప్పి  నిజామాబాద్ జిల్లాను బ్రతుకు లేని జిల్లాగా మార్చారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలని పోరాడితే నిర్బంధాన్ని ప్రయోగించి రైతాంగ ఉద్యమాలను అణచివేస్తున్నారన్నారు. గత నలభై నెలల నుండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని అక్రమంగా మూసి వేయడంతో కార్మికుల బ్రతుకులు వీధిన పడి, కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని  దుస్థితిలో బతుకుతున్నారన్నారు.   జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య సంఘటనగా ఏర్పడి పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో  సీపీఎం  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రమేష్ బాబు,  సీపీఐ కార్యదర్శి  కంజర భూమయ్య, టీపీఎఫ్‌‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు  హన్మంత్ గౌడ్, తెలంగాణ యువజన సమాఖ్య  నిజామాబాద్ ఇంచార్జి బండి కిరణ్, తెలంగాణ రైతాంగ సమాఖ్య రాష్ట్ర నాయకులు భూపాల్,  టీపీఎఫ్‌‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్ గైక్వాడ్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక నాయకులు టి.భిక్షపతి, పి. ఉపేందర్, రవి శంకర్ గౌడ్, శ్రీనివాస్‌‌ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న
 తెలంగాణ ప్రజాఫ్రంట్‌‌ నాయకులు

జీవో నెం.6ను వెంటనే రద్దు చేయాలి

   బెస్త, గూండ్ల, గంగపుత్రుల పొట్ట కొడుతున్న జీవోనెం.6ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని బెస్త గూండ్ల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు పూస సత్యనారాయణ కోరారు. సోమవారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇతర కులాల వారికి చేపలు పట్టే అవకాశం ఇవ్వకుండా  బెస్త, గూండ్ల, గంగపుత్రులకు 2014 ముందున్న విధంగానే  తమ కులవృత్తిని కొనసాగించేలా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బిసి‘ఎ’లోకి ఇతర బీసీ కులాలను చేర్చరాదని, ఒక వేళ చేర్చితే గంగపుత్రులను ‘ఎస్టీ’లో చేర్చాలని ఆయన డిమాండ్‌‌ చేశారు. గ్రామాల్లో నీటి సంఘాల ఛైర్మన్లు, గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు మాపై పెత్తనం చలాయిస్తూ.. చేపల అమ్మకం ధరలు వారే నిర్ణయిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవతీసుకొని మా హక్కులను కాపాడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బెస్త, గూండ్ల చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శంకర్‌‌,  జిల్లా అధ్యక్షుడు ఎ.గంగారాం, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌‌, ఉపాధ్యక్షుడు  ఉట్నూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న
 బెస్త, గూండ్ల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు పూస సత్యనారాయణ

నేటి కేసీఆర్‌‌ సభను విజయవంతం చేయాలి

‒ టి.ఆర్‌‌.ఎస్‌‌. రాష్ట్ర కార్యదర్శి విఠల్‌‌రావు

కేసీర్‌‌ అనేక సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారని నేడు నిజామాబాద్‌‌ జిల్లాకేంద్రంలో జరగనున్న పార్లమెంట్‌‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి ప్రజలు భారీగా తరలివచ్చి, సభను జయప్రదం చేయాలని టి.ఆర్‌‌.ఎస్‌‌. రాష్ట్ర కార్యదర్శి విఠల్‌‌రావు కోరారు. ఆయన సోమవారం నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో మీడియాతో మాట్లాడారు. రైతుబంధు, రైతు భీమా, ఆసరా పింఛన్లు, షాదీ ముభారక్‌‌, కేజీ టు పీజీ తదితర పథకాలతో టి.ఆర్‌‌.ఎస్‌‌ ప్రభుత్వం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు టి.ఆర్‌‌.ఎస్‌‌. పథకాలను కాపీకొడుతున్నాయన్నారు. నిజామాబాద్‌‌ ఎంపీ కవిత తెలంగాణ జాగృతితో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. మునుపెన్నడూ లేని అభివృద్ధిని నిజామాబాద్‌‌ పార్లమెంట్‌లో చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాబోయే పార్లమెంట్‌‌ ఎలెక్షన్‌‌లలో ఎంపీ కవితకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నుడా ఛైర్మన్‌‌ ప్రభాకర్‌‌రెడ్డి, రాష్ట్ర టి.ఆర్‌‌.ఎస్‌‌. సెక్రెటరీ తారిఖ్‌‌ అన్సారి, జిల్లా బీసీ సెల్‌‌ అధ్యక్షుడు సాయిబాబ గౌడ్‌‌, టి.ఆర్‌‌.ఎస్‌‌. సీనియర్‌‌ నాయకులు కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టి.ఆర్‌‌.ఎస్‌‌. రాష్ట్ర కార్యదర్శి విఠల్‌‌రావు

Saturday, 16 March 2019

అనుమతులు లేకుండా సెక్యూరిటీ ఏజెన్సీలు నడపొద్దు

‒ నిజామాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ కార్తికేయ

నిజామాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు: ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ (రెగ్యులేషన్‌‌) యాక్టు‒2005 మరియు తెలంగాణ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ (రెగ్యులేషన్‌‌) రూల్స్‌‌‒2008 ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా సెక్యూరిటీ ఏజెన్సీలు నడపరాదని నిజామాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇనిస్టిట్యూషన్స్‌‌, ఎస్టాబ్లిష్‌‌మెంట్లు మరియు ఆర్గనైజేషన్లు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలనుకొంటే వారు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వార మాత్రమే తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా ఎవరైనా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొన్నట్లయితే, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అలాగే ఏ సెక్యూరిటీ ఏజెన్సీ అయినా ప్రభుత్వం నుంచి లైసెన్స్‌‌ పొందిన తర్వాతనే సెక్యూరిటీ ఏజెన్సీని నడపవలసి ఉంటుందన్నారు. లేనియెడల వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని వివరించారు.


ప్రణాళికబద్దంగా పనులు పూర్తి చేసుకోవాలి


‒ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్

  సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఎన్నికలకు సంబంధించిన రోజువారి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లా ఎన్నికల మేనేజ్‌‌మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, ఈనెల 28 నుండి ఫోటో తో కూడిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం ప్రారంభించాలన్నారు. 21, 23, 24 తేదీలలో లో నెగోషియబుల్ ఇన్‌‌స్ట్రుమెంటల్ యాక్ట్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. ఓటర్ల జాబితా మదర్ రోల్, బ్యాలెట్ పేపర్లు పంపిస్తామని, వాటిని ఆయా జిల్లాల్లోనే ముద్రించుకోవాలని తెలిపారు. ఈవీఎంల పనితీరును సరిచూసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఇతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవాలని తెలిపారు.

వీసీ లో జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌ రావు మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నామని, 18వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ఈ వీసీలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌‌లో పాల్గొన్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

వీసీలో మాట్లాడుతున్న ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌‌కుమార్‌‌


మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌‌

  పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకల్ కేబుల్‌‌ నెట్‌‌వర్క్‌‌లో ప్రసారమయ్యే వార్తలను రికార్డ్ చేసే పక్రియను, మీడియా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోకల్ కేబుల్ నెట్‌‌వర్క్‌‌లో ప్రసారమయ్యే వార్తలను 24 గంటల పాటు రికార్డ్ చేసి అట్టి వార్త ఎన్నికల నిబంధనల మేరకు ఉందో లేదో పరిశీలించి, పెయిడ్‌న్యూస్‌‌గా బావించినట్లయితే సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా వివిధ న్యూస్ పేపర్‌‌లలో ప్రచురితమైన వార్తలను కూడా పరిశీలన చేసి కమిషన్ నిర్దేశించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియ జేసేందుకు జిల్లా పౌర సంబంధాల అధికారులు, వారి సిబ్బంది ఇక్కడి నుండే అందజేస్తారని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 18న నామినేషన్ల ప్రక్రియ కు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ పక్రియ ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారని అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో, మూడు వాహనాల కంటే ఎక్కువ తీసుకొని రాకూడదని, నామినేషన్ అభ్యర్థి తో కలిపి ఐదుగురు కంటే ఎక్కువగా ఆర్.ఓ గదిలోకి రాకూడదని ఈ సందర్భంగా చెప్పారు.

ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు..


ఈనెల 21, 23, 24 తేదీలలో ప్రభుత్వ సెలవులు ప్రకటించినందున నామినేషన్ల ను స్వీకరించబడదు. నామినేషన్ల ప్రక్రియకు తక్కువ రోజులు ఉన్నందున నామినేషన్ వేసే వారికి కలెక్టర్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా నామినేషన్ ఫారంలో ఏ విధంగా నింపాలి? ప్రక్రియ అఫిడవిట్, సెక్యూరిటీ డిపాజిట్‌‌, తదితర అంశాలపై నామినేషన్ వేసే అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.

లోకల్ కేబుల్ నెట్వర్క్ లో ప్రకటనలు, ఆడియో, వీడియో , పబ్లిసిటీ వాహనాలు, రేడియో ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రకటనలకు జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (ఎం సి ఎం సి) ద్వారా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పారు.

మీడియా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.అంజయ్య, సమాచార శాఖ ఉప సంచాలకులు (డి.పి.ఆర్.ఓ) మహమ్మద్ ముర్తుజా, రేడియో సమాచార ఇంజనీర్ వెంకటయ్య, అడిషనల్ పిఆర్ఓ రామ్మోహన్‌‌రావు, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.

మీడియా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

లోకల్‌‌వార్తలను రికార్డు చేసే ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌‌


సమస్యల పరిష్కారం దిశగా ట్రాన్స్‌‌కో

  మీ గ్రామంలో ఏదైనా స్తంభం వంగిపోయి.. విరిగిపోయి.. లేదా తుప్పు పట్టి పడిపోయే స్థితిలో ఉందా..?,  విద్యుత్‌‌ తీగలు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నవా..? అయితే వెంటనే విద్యుత్‌‌ శాఖ టోల్‌ఫ్రీ నెంబరు 1912, 18004250028 కు ఫోన్‌‌ చేస్తే .. సమస్యను  పరిష్కరించే దిశగా   చర్యలు తీసుకొంటామని నిజాసమస్యల పరిష్కారం దిశగా  ట్రాన్స్‌‌కో  మాబాద్‌‌ విద్యుత్‌‌ప్రగతి భవన్‌‌ సూపరింటెండెంట్‌‌ సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు.  ఇందులో భాగంగా ట్రాన్స్‌‌కో ఉద్యోగులు తప్పనిసరిగా హెచ్‌‌క్వార్టర్‌‌లలోనే ఉండేటట్లుగా ఉన్నతాధికారులు  ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైన అలా ఉండడం లేదని తెలిస్తే వారి వివరాలు ఇస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటామని  ఆయన తెలిపారు.  ఎవరైనా విద్యుత్‌‌ సిబ్బంది మీకు అందుబాటులో లేకపోవడం గాని, సేవలలో లోపం కాని ఉన్నట్లయితే  డివిజన్‌‌ల వారీగా క్రింద ఇవ్వబడిన నెంబర్‌‌లకు ఫోన్‌‌ చేసి  సమస్యలకు పరిష్కారం  పొందవచ్చన్నారు.

క్ర.సం. విభాగము             సంప్రదించాల్సిన నెంబరు
1. డీఈ, ఆపరేషన్‌‌, నిజామాబాద్‌‌ 94408  11582
2. డీఈ, ఆపరేషన్‌‌, బోధన్‌‌  79010  93941
3. డీఈ, ఆపరేషన్‌‌, ఆర్మూర్‌‌ 94408 11585

ప్రతి రైతుకు విద్యుత్‌‌ ఇవ్వడానికి టి.ఎస్‌‌.ఎన్‌‌.పి.డి.సి.ఎల్‌‌. సిద్దంగా ఉందని, రైతులు వ్యవసాయ విద్యుత్‌‌ కనెక్షన్‌‌ మంజూరు కొరకు 2 బోర్లు వేసి ఉండి, వాటికి రెండు డీడీలు కట్టినట్లయితే 16  కెవిఎ ట్రాన్స్‌‌ఫార్మర్‌‌, 3 బోర్లు వేసి ఉండి, 3 డీడీలు కట్టినట్లయితే వారికి 25  కెవిఎ డిస్ట్రిబ్యూషన్‌‌ ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ మంజూరు చేస్తామన్నారు. కొందరు వ్యవసాయదారులు బోర్లు వేయకున్నా ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ మంజూరు కోసం దరఖాస్తులు చేస్తున్నారని అలా చేయడం తప్పని,   బోర్లు వేసిన వారు మాత్రమే ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని  ఆయన సూచించారు. 

ఈనెల 21, 23, 24 తేదీలలో నామినేషన్‌‌లు స్వీకరించబడవు


జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారి ఎం.రామ్మోహన్‌‌రావు

లోక్‌‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 21, 23, 24 తేదీలలో నెగోషియేబుల్‌‌ ఇన్‌‌స్ట్రుమెంట్‌‌ యాక్ట్‌‌ కింద నామినేషన్‌‌లు స్వీకరించబడవని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారి, కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు తెలిపారు. లోక్‌‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18న నోటిఫికేషన్‌‌ జారీ చేయడంతో నామినేషన్‌‌ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్‌‌ల దాఖలుకు ఈనెల 25 చివరి తేదీ అన్నారు. నెగోషియేబుల్‌‌ ఇన్‌‌స్ట్రుమెంట్‌‌ యాక్ట్‌‌ కింద ప్రకటించే సెలవురోజుల్లో నామినేషన్‌‌లు స్వీకరించబడవని, ఈనెల 21, 23, 24న ఈ సెలవులు ఉన్నందున ఈ మూడు సెలవు రోజుల్లో నామినేషన్‌‌లు స్వీకరించబడవన్నారు. మిగితా కార్యాలయ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌‌లు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్‌‌ వివరించారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించండి-

మాదగోని సైదులు గౌడ్

నిజామాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు: నిరుద్యోగుల, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేసి పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాదగోని సైదులు గౌడ్ అన్నారు. శనివారం నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేక పోయిందని మండిపడ్డారు. ప్రతీ సంవత్సరం ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు అకాడమిక్ క్యాలెండర్‌‌ను రూపొందించాడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. పట్టభద్రులు ఆలోచించి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాదగోని సైదులు గౌడ్‌‌

12వ రోజు ఎస్‌‌.ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌‌


నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం మైదానంలో జరుగుతున్న ఎస్‌‌.ఐ, కానిస్టేబుల్‌‌ ఎంపిక దేహదారుడ్య పరీక్షలకు 12వ రోజు అయిన శనివారం మొత్తం 1000 మంది పురుష అభ్యర్థులకు గాను 905 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్తులకు ముందుగా ఎత్తు కొలత పరీక్ష నిర్వహించగా అందులో ఎంపికైన వారికి 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. తర్వాత కొద్దిసేపు విరామం ఇచ్చి ఈవెంట్స్‌‌ నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం, అందుబాటులో మెడికల్‌‌ టీం, అంబులెన్స్‌‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచనల మేరకు దేహదారుడ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల మార్కుల జాబితాను అభ్యర్థుల రిజిస్ర్టేషన్‌‌ నెంబరు ద్వారా tslprb.in వెబ్‌‌సైట్‌‌ ద్వారా డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చని పోలీస్‌‌ కమిషనర్‌‌ కార్తికేయ తెలిపారు. పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా ఎస్సై, కానిస్టేబుల్‌‌ ఎంపికలు జరుగుతున్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని ఆయన సూచించారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణలో జామాబాద్‌‌ అదనపు డీసీపీ ఎమ్‌‌. శ్రీధర్‌‌రెడ్డి, శిక్షణ ఐపీఎస్‌‌ గౌస్‌‌ ఆలం, కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఆర్మూర్‌‌, బోధన్‌‌ ఎన్‌‌.ఐ.బి, ఏఆర్‌‌, ట్రాఫిక్‌‌, సీసీఎస్‌‌, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థుల ఎంపికలను పర్యవేక్షిస్తున్న సీపీ కార్తికేయ

అభ్యర్థులకు వైద్య పరీక్షలు
జిల్లాకు విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 శనివారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రానికి  సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి. రమణ విచ్చేశారు.  ఈ సందర్భంగా ఆయనను  జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  న్యాయమూర్తిని కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే ఆయన వెంట జిల్లా సెషన్స్ జడ్జి సుజన న్యాయమూర్తిని  కలిశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న
 కలెక్టర్‌‌ రామ్మోహన్‌‌ రావు, పక్కన జిల్లా సెషన్స్‌‌ జడ్జి సుజన

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి. రమణ

విద్యార్థులు దేశ అభ్యున్నతికి పాటుపడాలి

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్‌‌ పాపిరెడ్డి
ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు సమాజసేవ అలవర్చుకోవాలని, తద్వారా దేశ అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌‌ పాపిరెడ్డి అన్నారు. ఆయన శనివారం నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌‌ హాల్‌‌లో జరిగిన నిషిత డిగ్రీ కళాశాల సిల్వర్‌‌ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నిషిత కళాశాల వ్యవస్థాపకుడు స్వర్గీయ భూమయ్య కృషి, పట్టుదల, అంకితభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. భూమయ్య.. కళాశాల పిల్లలను తన సొంత పిల్లలుగా భావించేవారన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు ఇచ్చేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరో ముఖ్య అతిథి తెలంగాణ యూనివర్సిటీ వైస్‌‌ ఛాన్స్‌‌లర్‌‌ పి.సాంబయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు ప్లేస్‌‌మెంట్స్‌‌ కల్పించడం అభినందనీయమన్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో డిమాండ్‌‌ ఉన్న ఏకైక డిగ్రీ కళాశాల నిషిత అని కొనియాడారు. టీఎస్‌‌సిహెచ్‌‌ఈ వైస్‌‌ ఛైర్మన్‌‌ ప్రొఫెసర్‌‌ ఆర్‌‌. లింబాద్రి మాట్లాడుతూ భూమయ్య చాలా దూర దృష్టి కలిగిన వ్యక్తి అని, 1994లో ప్రభుత్వ జూనియర్‌‌ కళాశాలల్లో డిమాండ్‌‌కు తగ్గట్లుగా సీట్లు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు డిగ్రీ చదవడానికి ఇబ్బందిపడే ఇబ్బందిపడే పరిస్థితి ఉండేదన్నారు. దీన్ని దూరదృష్టితో ఆలోచించి భూమయ్య అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ కళాశాలను ప్రారంభించారన్నారు. నాక్‌‌ (ఎన్‌‌.ఎ.ఎ.సి) ‘ఎ’ గ్రేడ్‌‌ సాధించిన ఏకైక డిగ్రీ కళాశాల నిషిత అని ఆయన కొనియాడారు. కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులను క్రమశిక్షణ, సాఫ్ట్‌‌ స్కిల్స్‌‌, కాన్ఫిడెన్స్‌‌ పెరిగే విధంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అందుకే కళాశాలకు ఇంతమంచి పేరు వచ్చిందన్నారు. అంతకు ముందు కళాశాల ఛైర్మన్‌‌ వినయ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ కళాశాలను మా నాన్న గారు కేవలం 36 మందితో మొదలు పెట్టారన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో, ఉపాధ్యాయుల కృషితో నేడు 2,300 విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందించే స్థాయికి చేరిందన్నారు. కళాశాలలో ప్రతి సంవత్సరం క్యాంపస్‌‌ ప్లేస్‌‌మెంట్స్‌‌ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఎందరో విద్యార్థులు మల్టీనేషనల్‌‌ కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రముఖ టీసీఎస్‌‌ కంపనీ 200 మందిని రిక్రూట్‌‌ చేసుకొంటే అందులో 120 మంది ఉద్యోగులు నిషిత విద్యార్థులు కావడం గర్వకారణమన్నారు. మా నాన్న గారు చనిపోయినా ఆయన ఆత్మ కళాశాల చుట్టూ తిరుగుతూనే ఉంటుందన్నారు. ఆయన ఆశయ సాధనకు, కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

అలరంచిన సాంస్కృతిక కార్యక్రమాలు


సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. విద్యార్థుల నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. ఈలలు.. గోలలు... స్టెప్పులతో స్టేజి దద్దరిల్లిపోయింది. అమ్మాయిల ఫ్యాషన్‌‌ షోలు అబ్బురపరిచాయి. ‘రౌడీ బేబి’ సాంగ్‌‌తో రచ్చరచ్చ చేసి.... ‘కమ్మారియా’ సాంగ్‌‌తో కుమ్మేశారు. అలాగే సాంప్రదాయ నృత్యాలతో స్పృశింపజేశారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన సినీ సింగర్స్‌‌ మాళవిక, దినకర్‌‌ల కమ్మని పాటలకు శ్రోతలు మైమరచిపోయారు.


కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్‌‌ పాపిరెడ్డి

కార్యక్రమంలోపాల్గొన్న  విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు 

విద్యార్థుల శాస్త్రీయ నృత్యం

యూనివర్సిటీ టాపర్‌‌కు సన్మానం