Tuesday, 19 February 2019

టీయుడబ్ల్యుజె అధ్యక్షుడిగా శేఖర్

* 50 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవం 

నిజామాబాదు వార్త :  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్షుడితో పాటు 50మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి బి.ఎస్.రామకృష్ణ సోమవారం నాడు ప్రకటించారు. ఇందులోభాగంగానే ఆంధ్రజ్యోతి కరీంనగర్ ఎడిషన్ బ్యూరో చీఫ్ నగునూరి శేఖర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూలు ప్రకారం నామినేషన్ల స్క్రూటని, ఉపసంహరణల ప్రక్రియ పూర్తయిందని, అధ్యక్ష పదవికి ఒకే ఒక నామినేషన్ మాత్రమే దాఖలైందని, అలాగే 50 రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవులకు 50 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఆర్ఓ రామకృష్ణ ప్రకటించారు. ఇదిలావుండగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర కార్యవర్గాన్ని త్వరలో జరిగే రాష్ట్ర మహాసభలో ఎన్నుకోవాల్సి ఉంది. కాగా, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నగునూరి శేఖర్ ను సోమవారం నాడు బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఐజేయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు మాజీద్, పిసిఐ మాజీ సభ్యులు అమర్ నాథ్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు దొంతు రమేష్, మహిపాల్ రెడ్డి, రాజేష్, వెలిజల చంద్రశేఖర్, హెచ్ యు జె నాయకులు శిగా శంకర్ గౌడ్, సుధాకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి తదితరులు అభినందించారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన 50మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.



No comments:

Post a Comment