Monday, 17 September 2018

అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు


దోమకొండ: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు రివాల్వింగ్‌ ఫండ్‌ అందిస్తామని విధాన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. దోమకొండలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెరాస ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టానుసారంగా వాగ్దానాలు చేస్తూ..ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, దళితునికి ముఖ్యమంత్రి పదవి.. ఇలా ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ, రూ.5 లక్షల ప్రమాద బీమా, ప్రతివ్యక్తికి 7 కిలోల సన్న బియ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, దళితులకైతే రూ.6 లక్షలు, అభయ హస్తం, బంగారు తల్లి పథకం కొనసాగింపు, సంవత్సరానికి ఆరు ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితం, బీడీలపై సుంకం తగ్గింపు వంటివి చేస్తామని వివరించారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గపు సభ్యుడు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యులు నల్లపు అంజలి, సాహెబుగారి కవిత, బాలవ్వ, జనార్ధన్‌రెడ్డి, భూమాగౌడ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment