Wednesday, 9 November 2016


డబ్బు ఆశతో దారుణానికి ఒడిగట్టిన భార్య..!


ప్రియుడితో కలిసి ఆభరణాల వేలం
ఓ ముఠాతో రూ. 10 లక్షలకు డీల్‌
ఏడుగురు నిందితుల అరెస్టు
రెండు లక్షల నగదు, పిస్టల్‌..
కత్తులు, వేటకొడవళ్లు,14 సెల్‌ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం
కేసును ఛేదించిన పోలీసులు

నవంబర్ 10,  వార్త.కామ్:

వివాహేతర సంబంధమే కడతేర్చింది. డబ్బు ఆశతో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌ వేసింది. రెక్కీ నిర్వహించి భర్తను దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన మౌలాలి హౌసింగ్‌ బోర్డు కాలనీ నోముల రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్‌ 29వ తేదీన జరిగింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షలు, పిస్టల్‌, 7.65 లైవ్‌ కాలిబర్‌ రౌండ్‌, 5 కత్తులు, రెండు వేట కొడవళ్లు, 14 మొబైల్‌ ఫోన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ బుధవారం వెల్లడించారు.

ఆర్థిక సమస్యలు.. తరచూ గొడవలు
మౌలాలి హౌసింగ్‌ బోర్డు కాలనీ నోముల రెసిడెన్సీలో గోపాలకృష్ణ, అతడి భార్య నాగ వినీలతో కలిసి నివసిస్తున్నాడు. గోపాలకృష్ణ బ్యాంక్‌లో రూ. 2 కోట్ల రుణం తీసుకుని డైరీ ఫాం నెలకొల్పాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తల్లి, భార్య, సోదరికి చెందిన 3కిలోల బంగారు ఆభరణాలను ఓ బ్యాంక్‌లో కుదవపెట్టి మళ్లీ లోన్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్యకు బ్యాంక్‌ మేనేజర్‌.. ప్రధాన నిందితుడు దుండ రవీందర్‌తో పరిచయం ఏర్పడడంతో వివా హేతర సంబంధానికి దారితీసింది. భర్తకు అప్పులు ఎక్కువకావడంతో ఆమె తరచూ గొడవపడేది. కొన్ని రోజుల తర్వాత బ్యాంక్‌ మేనేజర్‌తో సూర్యాపేటలో వేరు కాపురం పెట్టింది. డబ్బు ఆశతో బంగారు ఆభరణాలను బ్యాంక్‌ మేనేజర్‌ వేలం వేశాడు. గోపాలకృష్ణ తనవద్ద ఉన్న ఐదెకరాల భూమి అమ్మి నగలు విడిపించుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలిసిన రవీందర్‌, నాగ వినీల భయభ్రాంతులకు గురయ్యారు. ఆభరణాలు ఎక్కడి నుంచి తీసుకు రావాలని.. ఈ సమస్యకు పరిష్కారం గోపాలకృష్ణను హత్య చేయడమే మార్గమని పథకం వేశారు. రవీందర్‌ అతడు పనిచేసే బ్యాంక్‌లో ఖాతాదారుడైన రాజేంద్రనగర్‌కు చెందిన గొల్ల యాదయ్యను సంప్రదించి విషయం చెప్పాడు. యాదయ్య అతడి స్నేహితుడు మహ్మద్‌ మన్సూర్‌ను పరిచయం చేశాడు.

మన్సూర్‌ రూ. 10లక్షలు ఇస్తే హత్య చేసే జబేర్‌ ముఠా ఉందని రవీందర్‌కు చెప్పాడు. అతడు జబేర్‌ను కలిసి 3లక్షల అడ్వాన్స్‌ ఇచ్చాడు. నాగ వినీల నోముల రెసిడెన్సీలో రెక్కీ నిర్వహించింది. అపార్ట్‌మెంట్‌లో చిన్న పిల్లలు టెర్రస్‌పై ఆడు కుంటుండగా వారికి బాణసంచా కొనుక్కోమని డబ్బులిచ్చి కిందకు పంపించింది. ఆ తర్వాత జబేర్‌ ముఠాకు సమాచారం అందించింది. జబేర్‌, వాహిద్‌, మహ్మద్‌ హాజీ భవనంలోకి ప్రవేశించారు. జబేర్‌ పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గురితప్పడంతో వాహిద్‌, మహ్మద్‌ హాజీ కత్తులతో దాడి చేశారు. 54 పోట్లు పొడిచారు. గోపాలకృష్ణ మరణించడంతో అక్కడి నుంచి పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. దుండ రవీందర్‌, శెట్టిపల్లి నాగ వినీల, మహ్మద్‌ జబేర్‌, అబ్దుల్‌ అస్గర్‌, మహ్మద్‌ హాజీ, మహ్మద్‌ మన్సూర్‌, గొల్ల యాదయ్యను అరెస్టు చేశారు. వాహిద్‌ అలీ, జితేందర్‌సింగ్‌ పరారీలో ఉన్నారు.

హత్యకేసుల్లో నిందితులు
నిందితులు నగరంలో జరిగిన పలు హత్యకేసుల్లో ప్రధాన సూత్రధారులని సీపీ మహేశ్‌ భగవత చెప్పారు. జబేర్‌పై చాంద్రాయణగుట్టలో రౌడీషీట్‌ నమోదైందని, రాజేంద్రనగర్‌, బహదూర్‌పురా హత్యకేసుల్లో అతడి ప్రమేయం ఉందని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లికి చెందిన వాహిద్‌పై బహదూర్‌పురా, అంబర్‌పేటలో హత్యకేసు, ఉప్పల్‌లో ఆమ్స్‌ యాక్ట్‌ కేసులు, మహ్మద్‌ హాజీపై రాజేంద్రనగర్‌ పీఎస్‌లో హత్యకేసు నమోదైందని తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పిస్టల్‌ను నాందేడ్‌కు చెందిన జితేందర్‌సింగ్‌ వద్ద కొనుగోలు చేశారని చెప్పారు. బ్యాంక్‌ అధికారులకు తెలియకుండా బంగారు ఆభరణాలు వేలం వేయడం చట్టప్రకారం నేరమని, రవీందర్‌పై మరో కేసు నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ శశిధర్‌రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment