Tuesday, 8 November 2016

ఇకపై రూ. 500, 1000 చెల్లవు.. 
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం 

  • 4 వేల వరకు నేరుగా ఎక్కడైనా మార్పిడి
  • గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి
  • బ్యాంకుల పని వేళలు, కౌంటర్లు పెంపు
ఇది... సంచలన నిర్ణయం! దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే నిర్ణయం! నరకాసుర వధ జరిగిన కొన్నాళ్లకే... నల్ల ధనాసురుల’పై యుద్ధం! మోదీ... పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సాహసోపేత నిర్ణయం!

నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:
 
మీ జేబులో 500 లేదా వెయ్యి నోటు ఉందా? ఇంటి బీరువాలో అవే నోట్లు కట్టలు ‘కట్టలు’గా ఉన్నాయా!? మంగళవారం అర్ధరాత్రితో వాటికి కాలం చెల్లిపోయింది! అవి ఇప్పుడు చెల్లని కాగితాలతో సమానం. వాటి ‘విలువ’ కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది! మీకు ఖాతా ఉన్న బ్యాంకుకో, పోస్టాఫీసుకో వెళ్లండి! పాత 500, వెయ్యి నోట్లను జమ చేయండి! ఇందుకు డిసెంబరు 30 వరకు... అంటే 50 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత ఇక ఒకే ఒక చాన్స్‌. డిసెంబరు 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు ఆర్‌బీఐ నిర్దేశించిన కేంద్రాల్లో... ఒక డిక్లరేషన్‌ సమర్పించి పాత 500, 1000 నోట్లు జమ చేసుకోవచ్చు. కష్టపడి, నిజాయితీతో, అధికారికంగా సంపాదించుకున్న సొమ్ములైతే కాపాడుకోండి! కోట్లకు కోట్లు అక్రమంగా కూడబెట్టుకున్న నల్ల దొరలకు మాత్రం సంకటమే!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నల్లధనం’పై వీర ఖడ్గం ఎత్తారు. వెయ్యి, ఐదొందల కరెన్సీ నోట్లపై కత్తి వేటు వేశారు. నల్ల దొరలకు అనూహ్య, ఆకస్మిక షాక్‌ ఇచ్చారు. నల్లధనం అరికట్టడంపై ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన మోదీ... మంగళవారం రాత్రి ఒక్కసారిగా బాంబు’ పేల్చారు. త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ, దౌత్య అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ... మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పేలా 500, 1000 నోట్ల రద్దు గురించి ప్రసంగించారు. పేదల కష్టాలు, అవినీతి సమస్యకు ప్రధాన కారణం నల్ల ధనమే అని తేల్చారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం... ఇవే దేశ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు. అమాయకులను బలి తీసుకుంటున్న ఉగ్రవాదులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో మీకు తెలుసా అని ప్రశ్నించారు. నకిలీ కరెన్సీని సరిహద్దులను దాటించి... భారతలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఏదో ఒక్క సందర్భంలో వస్తుందన్నారు. ఆ నిర్ణయాత్మక సమయం ఇప్పుడే వచ్చిందన్నారు. నల్ల దొరలు పరుపుల కింద దాచిన నల్లధనం నశించాల్సిందేనని తెలిపారు. తాము తీసుకున్న చర్యలతో ఇప్పటికే 1.25 లక్షల కోట్ల నల్లధనం బయటికి వచ్చిందన్నారు. దీపావళి మరుసటి రోజు చెత్తా చెదారాన్ని ఊడ్చేసినట్లే... దేశం నుంచి నల్లధనాన్ని ఊడ్చేయాలన్నారు. దీనికి 50 రోజుల ప్రణాళిక ప్రకటించారు. ఇక... గురువారం నుంచి కొత్త 2వేలు, సరికొత్త డిజైన్‌తో ముద్రించిన 500 నోట్లు చలామణిలోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌ ప్రకటించారు.
 
దేశ విద్రోహులు, సంఘ వ్యతిరేకుల వద్ద ఉన్న పాత 500, 1000 నోట్లు ఇక చిత్తు కాగితాలతో సమానం!

దీపావళి మరుసటి రోజున మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నట్లే... నల్లధనం, నకిలీ కరెన్సీ నుంచి దేశాన్ని స్వచ్ఛం చేయాలి!
-నరేంద్ర మోదీ
 

No comments:

Post a Comment