Tuesday, 15 November 2016    నోట్లు.. ప్రజల పాట్లు..


    నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్ :

     నల్లధనం అరికట్టాలని పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆచరణలోకి వచ్చి సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర అయోమయానికి గురిచేయడంతో పాటు ఇబ్బందుల పాలు చేస్తోంది. పాత నోట్లు రద్దయి మంగళవారం నాటికి వారం రోజులైనప్పటికీ కొత్తనోట్లు పూర్తిస్థాయిలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయాయి. వారం రోజులుగా ఇంట్లో ఉన్న చిల్లర డబ్బులు పొదుపుగా ఖర్చుచేసి అత్యవసరమైన నిత్యావసర సరకులు కొనుగోలు చేస్తూ వారం పాటు నెట్టుకొచ్చారు. గురునానక్‌ జయంతిని పురస్కరించుకొని సోమవారం బ్యాంకులు మూసి ఉన్నాయి. ఏటీఎంలు కూడా బంద్‌ ఉన్నాయి. దీంతో మంగళవారం రద్దీ మరింత పెరిగింది. ఉదయం బ్యాంకుల తాళాలు తీయడానికి ముందునుంచే జనాలు బ్యాంకుల ముందు బారులుతీరి రోడ్లపై నిలబడ్డారు. పలు బ్యాంకులు తమ బ్యాంకుల ముందు షామియానాలు వేసి నీడను కల్పించాయి. ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌, మామిడిపల్లి, అంకాపూర్‌, ఆలూర్‌, పిప్రి, మంథని, దేగాం, గోవింద్‌పేట్‌తో పాటు పలు గ్రామాల్లోని ఏఈటీఎంలు పనిచేయలేదు. మామిడిపల్లిలో విజయ బ్యాంకు ఏటీఎం ఒక్కటే పనిచేసింది. దీంతో అందరు ఇక్కడికే చేరడంతో బ్యాంకు నిర్వాహకులు గార్డును నియమించి ఒక్కొక్కరు కేవలం రూ. 1000 మాత్రమే తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. పాత నోట్లు మార్చుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి అందరు బ్యాంకులకు వెళ్లడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం బ్యాంకులో వరుస క్రమంలో నిలబడేందుకు ఇబ్బందులకు గురయ్యారు. పనులు మానుకొని నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీయడం ప్రజలకు దినవారీ చర్యగా మారిపోయింది. ఇంతచేసి బ్యాంకులో రోజుకు రూ. 4000 వేలు మార్పిడి చేసుకుంటే రూ. 2000 వేల నోట్లు రెండు ఇస్తున్నారు. ఈ నోట్లు తీసుకుని నిత్యావసరాలు కొనుగోలు చేద్దామని వెళితే బయట ఎవరూ చిల్లర డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో నోట్లు మార్పిడి చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని రూ. 100, రూ. 50 నోట్లతోపాటు రూ. 500 నోట్లు ఎక్కువగా విడుదల చేస్తేగాని ఇబ్బందులు తొలగిపోవని పేర్కొంటున్నారు.

    No comments:

    Post a Comment