Wednesday, 9 November 2016

నేటి నుంచే అందుబాటులోకి కొత్త నోట్లు

  • నగదు బదిలీకి విస్తృత అవకాశాలు 
  • మరిన్ని అదనపు కౌంటర్ల ఏర్పాటు 
  • ప్రస్తుతానికి ఏటీఎంలలో రూ.50, రూ.100 నోట్లు 
  • శని, ఆదివారాల్లో పనిదినాలు? 
  • సురేష్ రెడ్డి లీడ్ బ్యాంకు మేనేజర్ తో నిజామాబాదు వార్త ఇంటర్వ్యూ

కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1,000 నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం అనేక ఆర్థిక సంస్కరణలకు నాంది పలకబోతోందని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లధనం ఉన్న వారికి తప్ప మిగతా వారందరికి ఇబ్బందులేమి ఉండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అయన వెల్లడించారు. గురువారం నుంచి బ్యాంకుల్లో కొత్త నోట్లు అందుబాటులోకి వస్తాయని ఏటీఎంలలో కొంత సమయం పట్టవచ్చన్నారు. అప్పటివరకు ఏటీఎంలలో పాత రూ.50, రూ. 100 నోట్లు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొ’న్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల వద్ద అదనపు కౌంటర్ల ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని చెప్పారు. రానున్న రెండో శని, అదివారాల్లో కూడా పనిదినాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయని, దీంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని 252 బ్యాంకులు, 338 ఏటీఎంల పరిస్థితి ఏంటనే విషయాలపై ఆయన నిజామాబాదు వార్త.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో వివరాలు వెల్లడించారు.

ప్రశ్న: పీఎం మోదీ ప్రకటనతో ప్రస్తుతం బ్యాంకుల పాత్ర ఏలా ఉండబోతోంది?
ఎల్‌డీఎం: ప్రభుత్వం తీసుకున్న నగదు బదిలీ వ్యవహారంలో బ్యాంకులు క్రీయాశీలక పాత్ర పోషించనున్నాయి. ఖాతాదారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా సేవలందించే దిశగా కార్యాచరణ సిద్ధమైంది. బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేసేందుకు సిబ్బందిని సిద్ధం చేశాం.

ప్ర: నేటి నుంచి బ్యాంకులు, ఏటీఎంలు ఎలాంటి సేవలను అందిస్తాయి?
ఎల్‌డీఎం: బ్యాంకుల్లో లావాదేవీలు గురువారం ప్రారంభమవుతాయి. బుధవారం రోజు కూడా సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కొత్త కరెన్సీకి సంబంధించి, పాత నిల్వల గురించి అంతర్గతంగా పనులు చక్కదిద్దారు. ఐతే ఏటీఎంలు గురువారం కూడా తెరిచే పరిస్థితి లేదు. మళ్లీ 11న సేవలు ప్రారంభమవుతాయి. కొత్త కరెన్సీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. అప్పటివరకు రూ. 50, రూ. 100 నోట్లను ఏటీఎంల ద్వారా అందిస్తాం.

ప్ర: ప్రభుత్వం తాజాగా రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి?
ఎల్‌డీఎం: శుక్రవారం వరకు మాత్రం ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్‌లైన్స్‌, రైల్వే, ఆర్టీసీ, డెయిరీ, ఆస్పత్రులతో పాటు పెట్రోల్‌బంకుల్లో తీసుకోవాలని అధికారులు చెప్పారు.

ప్ర: బ్యాంకులతో పాటు నగదు మార్పిడి ఎక్కడైనా చేసుకునే వీలుందా? ఎప్పటివరకు చేసుకోవచ్చు?
ఎల్‌డీఎం: ప్రధాన పోస్టాఫీసులు, సబ్‌పోస్టాఫీసుల్లో కూడా మార్పిడి చేసుకునే వీలుంది. డిసెంబరు 30 వరకు ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ ప్రత్యేక రంగాలకు, సంస్థలకు, వ్యక్తులకు గానీ నగదు మార్పిడి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అతితక్కువ కౌంటర్లలో వాటిని మార్చి 31 లోగా బదిలీ చేసుకునే వీలుంటుంది.

ప్ర: ప్రస్తుతానికి అవసరాలకు తగ్గట్టు నగదు బదిలీ ఎలా చేసుకోవచ్చు?
ఎల్‌డీఎం: ప్రస్తుతం ఏ బ్యాంకుకైనా ప్రజలు వెళ్లి పరిమితికి లోబడి నగదు బదిలీ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. బ్యాంకుల్లో ఇప్పటికైతే ఒక్కో వ్యక్తికి రూ. 4 వేల వరకు మార్పిడి చేసుకునే వీలుంది. తదనంతరం వీటి పరిమితిని రూ.10 వేలు, రూ.20 వేలకు పెంచుతారు. ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు రూ.2 వేల వరకే అందించే వీలుంది.

ప్ర: బ్యాంకుల్లో ఖాతాలేని వారి పరిస్థితేంటి?
ఎల్‌డీఎం: ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతా తెరిపించాలనేదే ప్రధానమంత్రి మోదీ లక్ష్యం. అందుకే విద్యార్థులకు కూడా ఖాతాల ద్వారానే ఉపకార వేతనాలు అందుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖాతా ఎంత అవసరమో తెలిసివస్తుంది. అయితే ఖాతా లేనివారు ఖాతాదారుడి అభ్యంతరం లేదనే పత్రాన్ని రాసుకొని, తన ఏదైనా గుర్తింపుకార్డు చూపిస్తే మార్పిడికి అవకాశం ఉంటుంది. అది కూడా పరిమితులకు లోబడి.

ప్ర: నగదు చెల్లింపులు అవసరమైతే ఎలా?
ఎల్‌డీఎం: బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బులను తీసి కొత్త నోట్లతో నేరుగా డబ్బులు చెల్లించడమనేది కొంత కాలం ఇబ్బందికరంగా ఉంటుంది. ఐతే నేరుగా డీడీలు, చెక్కులు, నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, మొబైల్‌బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌కార్డు, తదితరాల రూపంలో చెల్లింపులు చేసుకోవచ్చు.

ప్ర: బ్యాంకుల వద్ద నేటి పరిస్థితి ఎలా ఉండవచ్చు?
ఎల్‌డీఎం: జిల్లాలోని కొన్ని బ్యాంకులకు ఈపాటికే కొత్త కరెన్సీ వచ్చేసింది. ఐతే వీటితో లావాదేవీలు జరిపేందుకు జనం ఆసక్తి కనబరుస్తారు. వందలాది మంది క్యూ కట్టే ప్రమాదం ఉంది. అందుకే నిల్వల ఆధారంగా ఖాతాదారులకు అవకాశాలివ్వాలని చెప్పాం. ప్రస్తుతం ఉన్న డిమాండు దృష్ట్యా ప్రజలు ఆందోళన చేసే అవకాశాలుండడంతో బ్యాంకుల వద్ద పోలీసు భద్రతను కోరాం.

ప్ర: వరుస సెలవులు వస్తున్నాయి. ఎలాంటి ప్రభావం చూపవచ్చు?
ఎల్‌డీఎం: రెండో శని, అదివారాల్లో కూడా బ్యాంకులు సేవలందించాలని నిర్ణయించాం. నవంబరు 14న వచ్చే గురునానక్‌ జయంతిన తప్పనిసరిగా సెలవుదినం పాటించే వీలుంది.

ప్ర: వివాహం, ఇతరత్రా శుభకార్యాలు, రైతుల చెల్లింపులు, తదితర ఇబ్బందులను ఎలా అధిగమించాలి?
ఎల్‌డీఎం: పరిస్థితి చక్కబడే వరకు ఒపిక పట్టాల్సిందే. డబ్బుల వ్యవహారాలు ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో చేసుకోవచ్చు. లేదంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ప్ర: నోట్ల రద్దు వ్యవహరం ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది?
ఎల్‌డీఎం: ముఖ్యంగా నల్లధనం ఉన్నవారు దీనితో దారికొస్తారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, లైసెన్సులేని వ్యాపారులు, ఫైనాన్స్‌ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పవు

No comments:

Post a Comment