Tuesday, 15 November 2016



    పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పెద్దపీట

    పతంజలి పరిశ్రమ ఏర్పాటైతే రైతులకు మేలు ఎంపీ కవిత


    నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్:

    పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పసుపు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని గ్రహించి జిల్లాలో పసుపు పరిశ్రమల ఏర్పాటుకు పతంజలి గ్రూపు అధినేత రాందేవ్‌ బాబాను తాను కలిసినట్లు చెప్పారు. జిల్లాలో పరిస్థితులను పరిశీలించేందుకు ఆ గ్రూపు సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కంపెనీల ఏర్పాటు ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితం అయ్యేవని, కానీ తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మన రాష్ట్రం పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందేందుకు ఇప్పటికే రకరకల పాలసీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారని తెలిపారు. భారతదేశంలోనే మన రాష్ట్రం పారిశ్రామిక రంగంగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి మొదటి స్థానంలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులకు మేలు చేసేలా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ..రైతుల ప్రయోజనం కోసం పతంజలి యూనిట్లను నెలకొల్పుతామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమను నెలకొల్పడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మన వద్ద ఉన్న వనరుల ద్వారానే పరిశ్రమ ఏర్పాటు చేయాలనేది తమ సంస్థ ఉద్దేశం అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే పరిశ్రమల ఏర్పాటుకు తాము ముందుకు వస్తున్నామని..వ్యాపార పరంగా కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. పసుపు వంటకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, ఇది ఔషధంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగర మేయర్‌ ఆకుల సుజాత, అధికారులు పాల్గొన్నారు.

    No comments:

    Post a Comment